కేసీఆర్ క్యాబినేట్‌లో మంత్రులుగా ఆ నలుగురికి ఛాన్స్

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. టిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని రికార్డు సృష్టించింది. దీంతొ మళ్లీ కేసీఆర్ సారధిగా ప్రభుత్వం కొలువుతీరనుంది.  ఇప్పుడు అందరి దృష్టి నూతన కేభినేట్ పైకి మళ్లింది. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం దక్కనుందో అని అంతటా చర్చ జరుగుతోంది. పలువురు కీలక మంత్రులు ఓటమి పాలయ్యారు. దీంతో అదే సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలకు దాదాపు మంత్రులుగా బెర్తు ఖాయం అయినట్టు తెలుస్తోంది.

ఎర్రబెల్లి దయాకర్ రావు

మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు  కొల్హాపూర్ నుంచి ఓటమి పాలయ్యారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నుంచి గెలుపొందారు. ఆయన గతంలోనే మంత్రి పదవి ఆశించినా అది దక్కలేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ తో రెడ్యా నాయక్

డోర్నకల్ నుంచి గెలిచిన రెడ్యా నాయక్ కు కూడా మంత్రి పదవి వరించనున్నట్టు తెలుస్తోంది. ములుగు నుంచి  మాజీ మంత్రి ఆజ్మీరా చందులాల్ ఓటమి పాలయ్యారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన రెడ్యా నాయక్ కు మంత్రిగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి గెలుపొందారు. రెడ్యా నాయక్ రాజశేఖర్ రెడ్డి కేభినేట్ లో మంత్రిగా పనిచేశారు. ఆయన సీనియర్ నాయకుడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రెడ్యా నాయక్ కు కేసీఆర్ అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.

నిరంజన్ రెడ్డి

తాండూరు నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయన స్థానంలో వనపర్తి నుంచి గెలుపొందిన నిరంజన్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మహేందర్ రెడ్డి ఓటమి పాలు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నిరంజన్ రెడ్డికి అవకాశం దక్కనున్నట్టుగా తెలుస్తోంది.  

ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి ఓటమి పాలయ్యారు. ఖమ్మంలో టిఆర్ఎస్ గెలవలేకపోయింది. కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రమంతా టిఆర్ఎస్ గాలి వీస్తే ఖమ్మంలో మాత్రం టిఆర్ఎస్ ఊసే లేకుండా పోయింది. ఖమ్మం టౌన్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే గెలిచారు.

ఖమ్మం జిల్లా రాజకీయాలు చాలా కీలకమైనవి కావడంతో మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రి పదవి ఇచ్చి జిల్లాను అభివృద్ది చేయాలని తద్వారా టిఆర్ఎస్ ను బలోపేతం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.

పువ్వాడ అజయ్ కుమార్

మరో వైపు తుమ్ముల నాగేశ్వరరావు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఓటమిని కేసీఆర్ ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారట. ఫలితాలు రాగానే తుమ్మలను ఖమ్మం నుంచి హైదరాబాద్ పిలిపించుకొని మాట్లాడారు. తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మళ్లీ మంత్రిగా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Related image

ఈ సారి కేబినేట్ లో మహిళకు మంత్రి పదవి  ఇచ్చే అవకాశం ఉంది. మహిళకు మంత్రి పదవి ఇస్తే డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి అవకాశాలు ఉన్నాయి. కానీ దీని పై స్పష్టత లేదు. పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ నుంచి గెలిచారు. పై నలుగురికి మంత్రి పదవులు దాదాపు ఖాయమైనా పద్మా దేవేందర్ రెడ్డి విషయంలో క్లారిటి లేదు. మహిళలకు మంత్రి పదవి ఇస్తే పద్మా దేవేందర్ రెడ్డినే రేసులో ఉంటారు. 

కేసీఆర్ కేభినేట్ లో కొత్త ముఖాలు రాబోతున్నాయి. మరి కొంత మంది కొత్త వారిని కేభినేట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాత మంత్రులలో నలుగురికి ఉద్వాసన పలుకుతారని చర్చ జరుగుతోంది.