ఈ టీఆర్ఎస్ లీడర్లకు తప్పని టెన్షన్…

 

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అసెంబ్లీ రద్దు మరుక్షణమే 105 మంది అభ్యర్థులను ఖరారు చేసి సంచలనం సృష్టించారు. ఉన్న సిట్టింగుల్లో ఇద్దరికి షాక్ ఇచ్చారు. వారిలో ఒకరు ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ కాగా, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ లేదని తేల్చి పారేశారు. అయితే 105 సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన కేసిఆర్ మరికొన్ని స్థానాల్లో పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడున్న సిట్టింగులందరికీ సీట్లు ఇచ్చారు. సిట్టింగ్ లకే కాదు నియోజకవర్గాలకు ఇన్ఛార్జులుగా ఉన్న వారికి కూడా టికెట్లు ఇచ్చారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి మీద ఓడిపోయిన నోముల నర్సింహ్మయ్యకు మళ్లీ టికెట్ ఇచ్చారు. కల్వకుర్తిలో వంశీచంద్ రెడ్డి మీద ఓడిపోయిన జైపాల్ యాదవ్ కు మళ్లీ టికెట్ ఇచ్చారు. నల్లాల ఓదేలు స్థానంలో ఎంపి సుమన్ కు, బాబూమోహన్ స్థానంలో జర్నలిస్టు నేత క్రాంతికి టికెట్ ఖరారు చేశారు.

ఇక వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖకు సీటు ఖరారు చేయలేదు. ఆ స్థానం పెండింగ్ లో పెట్టారు. కొండా సురేఖ పార్టీ మారతారన్న ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఆమెకు సీటు ఖరారు చేయలేదని తెలిసింది. ఒకవేళ ఆమె కాంగ్రెస్ లో చేరితే ఆమె స్థానంలో మేయర్ నన్నపనేని నరేందర్ పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత జాబితాలో వరంగల్ తూర్పు సీటు పెండింగ్ లో పెట్టారు.

ఇక అటు ఇటూ ఊగిసలాడి తుదకు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్ కు కూడా టికెట్ ఖరారు చేయలేదు. దానం నాగేందర్ ఖైరతాబాద్ లో పోటీ చేయాలని ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఆయనకు సీటు ఇవ్వలేదు. దానం ను ఒక దశలో గోషామహల్ లో పోటీ చేయించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ దానం పేరు ఇంకా ఖరారు చేయలేదు. దానం అయితే ఖైరతాబాద్ లేదంటే గోషామహల్ లో పోటీ చేయవచ్చని చెబుతున్నారు.

 

ఇక తీవ్రమైన వివాదాల్లో చిక్కుకున్న చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అభ్యర్థిత్వాన్ని కూడా కేసిఆర్ ఖరారు చేయలేదు. జాబితాలో ఆ సీటును ఇంకా పెండింగ్ లోనే ఉంచారు. బొడిగె శోభ మీద నిన్న కూడా కొందరు ఎంపిపిలు, జెడ్పీటిసిలు సిఎం కేసిఆర్ కు మూకుమ్మడిగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

వికారాబాద్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం సంజీవరావు ఉన్నారు. ఆయనే అభ్యర్థిత్వాన్ని కూడ కేసిఆర్ పెండింగ్ లో పెట్టారు. అక్కడ వేరే అభ్యర్థి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. పిసిసి అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభ్యర్థి ప్రకటన పెండింగ్ లో ఉంచారు కేసిఆర్. అక్కడ గత ఎన్నికల్లో తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను గత ఎన్నికల్లో పోటీకి పెట్టారు. ఈసారి  అక్కడ ఎవరికి ఇస్తారన్నదానిపై కసరత్తు జరుగుతున్నది.

మల్కాజ్ గిరి స్థానంలో ఉన్న కనకారెడ్డి. సి తోపాటు, మేడ్చల్ సుధీర్ రెడ్డి స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. వారికే ఇస్తారా? లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

అలాగే కోదాడ సీటును ఇంకా కేసిఆర్ ప్రకటించలేదు. ప్రస్తుతం కోదాడ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గతంలో కోదాడ నుంచి వేనేపల్లి చందర్ రావు పోటీ చేసి పద్మావతి రెడ్డి మీద ఓడిపోయారు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోదాడ బరిలో ఎవరిని నిలుపుతారన్నది ఇంకా ఖరారు కాలేదు. అక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్న టిడిపి నేత బొల్లం మల్లయ్య యాదవ్ టిఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.

ఆ నాలుగు బిజెపి సిట్టింగ్ సీట్లు పెండింగ్ లోనే

తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేసిఆర్ ఎంఐఎం పార్టీ తమకు ఫ్రెండ్లీ పార్టీ అని విస్పష్ట ప్రకటన చేశారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని కేసిఆర్ తేల్చి చెప్పారు. ఎంఐఎం సభ్యులుగా ఉన్న స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందని ప్రకటించారు. అయినప్పటికీ అక్కడ నామమాత్రంగా ప్రభావితం చూపే అభ్యర్థులను ఖరారు చేశారు.

ఇక బిజెపి ప్రాతినిథ్యం వహిస్తున్న ఐదు స్థానాల్లో ఒక్క స్థానంలో మాత్రమే అభ్యర్థిని ప్రకటించి మిగతా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్ లో ఉంచారు కేసిఆర్. అందులో అంబర్ పేట సిట్టింగ్ కిషన్ రెడ్డి ఉన్నారు. ముషీరాబాద్ లో డాక్టర్ లక్ష్మన్ ఉన్నారు. ఖైరతాబాద్ లో చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. గోషామహల్ లో రాజాసింగ్ ఉన్నారు. ప్రస్తుతం వీరి సీట్లన్నీ పెండింగ్ లో ఉంచారు. వీరి సీట్లలో ఇప్పటికే బలమైన అభ్యర్థులు టిఆర్ఎస్ కు ఉన్నట్లు చెబుతున్నారు. కేవలం ఉప్పల్ సీటులో మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు. ఉప్పల్ సిట్టింగ్ గా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నారు. ఉప్పల్ లో బేతి సుభాష్ రెడ్డి పేరును ఖరారు చేశారు కేసిఆర్. అయినప్పటికీ మిగతా నాలుగు బిజెపి స్థానాల్లో ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

పెండింగ్ లో ఉన్న సీట్లు ఇవే

1 మలక్ పేట్

2 అంబర్ పేట్

3 ముషీరాబాద్

4 ఖైరతాబాద్

5 గోషామహల్

6 చార్మినార్

7 చొప్పదండి

8 వరంగల్ ఈస్ట్

9 వికారాబాద్

10 మేడ్చల్

11 మల్కాజ్ గిరి

13 హుజూర్ నగర్

14 కోదాడ