డేంజర్ జోన్ లో కాంగ్రెస్ ఉత్తమ్, శ్రీధర్ బాబు

అవును. మీరు చదివింది నిజమే. పిసిిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇది మేము చెబుతున్నమాట కాదు ఏకంగా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాటల్లో, ఆయన హావభావాల్లో కనిపించిన కసిని బట్టి అర్థమవుతున్నది. మరంతగా ఈ ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు ఎందుకు డేంజర్ జో్న్ లో ఉన్నారు? కేసిఆర్ వారిద్దరినే ఎందుకు కంట్లె పెట్టుకున్నారు? పూర్తి వివరాలు ఇవీ.

మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితి పాక్షిక మేనిఫెస్టోను కేసిఆర్ వెలువరించారు. ఈ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లీక్ ఇచ్చిన హామీలన్నీ కేసిఆర్ ప్రకటించేశారు. నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ చెబుతున్నదానికంటే 16 రూపాయలు ఎక్కువ ప్రకటించారు. వికలాంగుల పెన్షన్ సైతం 16 రూపాయలు ఎక్కువ ప్రకటించారు. ఆసరా పెన్షన్లు సైతం కాంగ్రెస్ చెప్పినదానికంటే 16 రూపాయలు ఎక్కువ ప్రకటించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రెస్ మీట్ లో కేసిఆర్ కొన్ని విషయాల పట్ల చాలా కటువుగా మాట్లాడారు. పిపిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీద కూడా కరుకుగానే హెచ్చరికలు జారీ చేశారు. అందరికంటే ఎక్కువగా నిన్నటి ప్రెస్ మీట్ లో వీరిద్దరి పట్ల కేసిఆర్ చాలా సీరియస్ గా కనిపించారు. 

కేసిఆర్ చెబుతున్నదాన్నిబట్టి తొలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల చరిత్ర అంతా తమ వద్ద ఉందని హెచ్చరికలు పంపారు. ఇండ్ల నిర్మాణంలో ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో ఆ లెక్కలు పద్దులు అన్నీ తన వద్ద భద్రంగా ఉన్నాయని చెప్పారు. నెక్ట్స్ గవర్నమెంట్ వచ్చుడే ఆలస్యం హౌసింగ్ స్కాం బయటకు తీసి తడాఖా చూపిస్తామన్నట్లు కేసిఆర్ హెచ్చరికలు కనిపించాయి. ప్రత్యేకంగా మంథని నియోజకవర్గాన్ని కేసిఆర్ ఉధహరించారు. 

కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగినట్లు టిఆర్ఎస్ సర్కారు వచ్చిన కొత్తలోనే విచారణ జరిపింది. అయితే ఆ అవినీతి వివరాలను ఇప్పటి వరకు బయట పెట్టలేదు. కానీ ఏ క్షణమైనా ఆ చిట్టా బయటకు తీసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని లోపలేయాలన్న స్కెచ్ టిఆర్ఎస్ వద్ద ఉన్నది. ఎందుకంటే అప్పట్లో హౌసింగ్ శాఖా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డే ఉన్నారు. కాబట్టి ఆయనను అవినీతి కేసులో లోపలేయడం పెద్ద సమస్య కాదని టిఆర్ఎస్ అధిపతి భావిస్తున్నారు.

మరి ఈ నాలుగున్నరేళ్లు ఎందుకు చేయలేదన్నదానిపైనా కేసిఆర్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం రాగానే కేసులు పెట్టి లోపలేస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అపవాదును పుట్టిస్తారని, అందుకే ఆ అవినీతి కేసులను పెండింగ్ లో పెట్టామని కేసిఆర్ తేల్చి చెప్పారు. తర్వాత గవర్నమెంట్ రాగానే ఐదేళ్ల కిందటి అవినీతి కేసులను బయటకు తీసి చర్యలు తీసుకోబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

ఇటీవల కాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మార్కు ను వదిలేసి కేసిఆర్ స్టయిల్ వంటబట్టించుకున్నారు. కేసిఆర్ ను కేసిఆర్ భాషలోనే తిడుతూ సంచలనం రేపుతున్నారు. కేసిఆర్ ను బట్టేబాజ్ సిఎం అన్నారు. అంతేకాదు నోటికొచ్చినట్లు ఉత్తమ్ తిడుతూ కేసిఆర్ కు ధీటైన సమాధానం ఇస్తున్నారు. దీన్ని కూడా కేసిఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనబడుతున్నది. ఒక సభలో నన్ను ఉత్తమ్ బట్టేబాజ్ గాడు అంటడా అంటూ కేసిఆర్ ప్రశ్నించారు. 

అయితే ఇటీవల కాలంలో తొలుత జగ్గారెడ్డిని పాత కేసు తిరగదోడి లోపలేసిన వెంటనే రేవంత్ ను సైతం లోపలేసే ప్రయత్నం చేసింది టిఆర్ఎస్ సర్కారు. కానీ రేవంత్ చిట్టా విప్పగానే ఐటి అధికారులకు పెద్దగా గిట్టుబాటు కాలేదు. దీంతో లోపలేయడాన్ని పెండింగ్ లో పెట్టేశారు. అంతేకాకుండా జగ్గారెడ్డిని 14 ఏండ్ల కిందటి కేసును తిరగదోడి లోపలేయడం పట్ల సర్కారు మీద వ్యతిరేకత వ్యక్తమైనట్లు సర్కారు పెద్దలు గుర్తించారు. అందుకే ఎలాగైనా రేవంత్ ను లోపలేయాలనుకున్నా కూడా వేయలేకపోయారన్న చర్చ ఉంది.

నిజానికి వీరిద్దరి కేసు తర్వాత ఉత్తమ్ హౌసింగ్ స్కామ్ ను బయటకు తీసి ఆయనను లోపలేయాలన్న ప్లాన్ ఉన్నట్లు టిఆర్ఎస్ లో  ప్రగతి భవన్ కు సన్నిహితంగా ఉండే ఒక నేత వెల్లడించారు. కానీ ముందస్తు ఎన్నికల వేళ ఇలా లోపలేస్తూ పోతే మరింత వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తదన్న ఉద్దేశంతో ఉత్తమ్ కేసును బయటకు తీయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి ఇలా వరుసగా రెడ్లనే టార్గెట్ చేసి లోపలేసే ప్లాన్ చేస్తే రెడ్డి కమ్యూనిటీ మొత్తం టిఆర్ఎస్ మీద తిరుగుబాటు చేసే ప్రమాదముందని కూడా గ్రహించి పెండింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. 

ఎన్నికలు ముగిసిన వెంటనే ఒకవేళ టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే వెంటనే ఉత్తమ్ ను, అలాగే హౌసింగ్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంథని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబును జైల్లో వేయడం మాత్రం ఖాయమని నిన్న ప్రెస్ మీట్ లో కేసిిఆర్ మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతున్నది. అయితే ఉత్తమ్ తిట్టుకు ప్రతి తిట్టు తిడుతున్నాడని లోపలేసే ప్రయత్నం చేయవచ్చు కానీ శ్రీధర్ బాబు ను ఎందుకు టార్గెట్ చేశారన్నది తేలాల్సి ఉంది.