రాచకొండ ఫిల్మ్ సిటి ఏక్కడ సారూ?

 

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు తెరలేసింది . ఇక ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలపై ద్రుష్టి పెడుతుంది . చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా తరువాత సినిమాకు ఎం చేశారు ? సినిమావాళ్లను తీయని మాటలతో ఎలా గారడీ చేసి ఆడుకున్నాడు . ఇది నిజమే !
సినిమా వారు అందరికీ వ్యధలను కథలుగా చెప్పి కాసులు సంపాదించుకుంటారు . గ్రామర్ కు గ్లామర్ అద్ది సెలెబ్రెటీలుగా చలామణి అవుతుంటారు . సమాజంలో తామే తెలివికలవాళ్లమని , క్రియేటివ్ జీనియస్ లమని డప్పేసి మరీ చెబుతుంటారు .

అలాంటి సినిమావారిని మరిపించి, మురిపించి మాయ చేసింది ఎవరో తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు . మద్రాసులో వున్న తెలుగు సినిమాను హైద్రాబాద్ కు తరలించింది మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నా రెడ్డి . 1980లో ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు స్వయంగా మద్రాస్ వెళ్లి అక్కడ స్థిరపడ్డవారిని హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు . సినిమా స్వరాష్ట్రం లో ఉండాలనే ఉద్దేశ్యం తో , రాయితీలు , సబ్సిడీలు కలిపించారు . ఉండటానికి నివాస స్థలాలు కూడా ఇచ్చారు . తెలుగు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు , సాంకేతిక నిపుణులు అందరు చెన్నారెడ్డి మాటకు విలువిచ్చి హైద్రాబాద్ వచ్చారు . అదే నేటి ఫిలిం నగర్ .

మద్రాసులో వేళ్లూనుక పోయిన సినిమా మహావృక్షం హైదరాబాద్ కు వచ్చేసింది . ఇక్కడ సంపూర్ణంగా స్థిరపడింది. ఎన్టీ రామారావు , ఎన్ . జనార్ధన రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి ,చంద్ర బాబు , రాజశేఖర్ రెడ్డి , కె . రోశయ్య .ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి అందరు సినిమా రంగాన్ని ఆదరించారు , ప్రోత్సహించారు .

అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో 2001లో తెలుగు దేశం పార్టీలో వున్న చంద్ర శేఖర్ రావు మంత్రి పదవి రాలేదని బయటకు వచ్చి “తెలంగాణ రాష్ట్ర సమితి ” ఉద్యమ పార్టీ ప్రారంభించారు . కాలక్రమంలో ఈ పార్టీ ప్రజలకు చేరువయ్యింది . ఉద్యమ ఊపందుకుంది . ఈ సమయంలో సినిమావారి కస్టాలు అన్నీ ఇన్నీ కావు . చిన్నా పెద్ద అందరు సినిమా వారిని బెదిరించడం చేసేవారు , షూటింగ్ లు ఆపుచెయ్యడం తో అప్పుడు ఎంతో మానసిక క్షోభకు గురయ్యారు .

2014 జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది . తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం వారు అభద్రతాభావంతో వుండాల్చిన పనిలేదని కేసీఆర్ హామీ ఇచ్చాడు . దీంతో సినిమా వారు కొంత స్థిమిత పడ్డారు . తెలంగాణాలో సినిమా కు బ్రహ్మ రథం పడతామని చెప్పాడు .అత్యాధునిక సౌకర్యాలతో బ్రహ్మాండమైన ఫిలిం సిటీని నిర్మిస్తామని ప్రకటించాడు . ఒకరోజు అధికారులతో కలసి రాచకొండ గుట్ట దగ్గర పర్యటించాడు . అది ఒకప్పుడు వెలమ దొరలు రాజ్యమేలిన భూమి . అందుకే కేసీఆర్ చారిత్రక నేపథ్యం వున్న ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారని అనుకున్నారు . ఆ తరువాత కొన్నాళ్లకే చంద్ర శేఖర్ రావు రామోజీ రావును ఆయన ఫిలిం సిటీలో కలిశారు . వారిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో తెలియదు . కేసీఆర్ రాచకొండ ఫిలిం సిటీ ఊసే ఎత్తలేదు .

మరికొంత కాలానికి ప్రభుత్వం ఒక ఫిలిం స్కూల్ ను ప్రారంభిస్తున్నదని , ఇందుకోసం , పూనా , మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లను సందర్శించడాని ప్రతినిధులను పంపిస్తున్నదని కేసీఆర్ ప్రకటించాడు .మరి కొన్నాళ్ళకు దీని ఊసే లేదు .

తెలుగు సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుందని ప్రకటించారు . 2015వ సవత్సరానికి దరఖాస్తులు చేసుకొమ్మని నోటిఫికేషన్ కూడా ఇచ్చింది . చిత్ర నిర్మాతలు అప్లికేషన్ ఫారం తో పాటు డీడీ లను కూడా ప్రభుత్వానికి పంపారు . అవార్డు ఏది ఉంటే బాగుంటుందో నిర్ణయించడాని ఓ కమిటీ కూడా వేశారు . కాకతీయ కళాతోరణం , లేదా యాదాద్రి లక్ష్మి నరసింహ పేరు మీద సింహ , ఈ రెండు ముఖ్యమంత్రి పరిశీలనా కోసం పంపించి మూడు సంవత్సరాలు అవుతుంది . దీనిమీద కేసీఆర్ ద్రుష్టి పెట్టలేదు . సినిమా రంగం మంచి చెడ్డలు చూడటాన్ని ఎఫ్ .డి .సి ఉంది . చాలాకాలం ఇది ఉమ్మడిగా పనిచేసింది . తరువాత రెండుగా విడిపోయాయి . తెలంగాణా చలన చిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా తమ వాడైన రామ్మోహన్ రావును నియమించారు. ఈయన గతంలో పద్మాలయ మల్లికార్జునతో కల్సి ఓ సినిమా నిర్మించాడు . అయితే ఇంతవరకు ఎఫ్ డీ సీ బోర్డును మాత్రం వెయ్యలేదు .

హైద్రాబాద్ లో స్థిరపడిన తెలుగు సినిమా ఆంధ్ర ప్రదేశ్ వెళ్ళదని కేసీఆర్ కు బాగా నమ్మకం కలిగింది . అందుకే అన్నీ చేస్తామని చెబుతారు ఏమీ చెయ్యరు . అయినా ఎవరు నోరు మెదపరు . ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అందరికీ ఇప్పటికీ హడలే !