గ్రేటర్ ఎన్నికల్లో తెరాస దెబ్బతినడానికి మెయిన్ రీజన్ కేటీఆర్ చేసిన ఆ పనేనా ?

kcr did mistake in ghmc election
గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి ఊపేస్తాం అంటూ గొప్పలు చెప్పిన తెరాస చివరికి 55 స్థానాలతో సర్దుకోవాల్సి వచ్చింది.  గత ఎన్నికల్లో ఘనంగా 99 స్థానాలు కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈసారి 44 స్థానాలు కోల్పోవడం పెద్ద విషయమే.  ఒకరకంగా చెప్పాలంటే ఓటమిని ముద్దాడినట్టే అనుకోవాలి.  తెరాస లీడర్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడ్డామని చెప్పుకుంటున్నా కూడ జనంలో వచ్చిన ఈ వ్యతిరేకతను అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు.  రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ పాలన మీద ఇంత భారీ స్థాయిలో విముఖత చూపించడం ఇదే తొలిసారి.  ఈ వెనుకబాటుకు అనేక కారణాలున్నాయి.  అందులో ప్రధానమైనది తెరాస పాలన పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడమే.  
 
kcr did mistake in ghmc election
kcr did mistake in ghmc election
అనుకోకుండా వచ్చిన వరదల కారణంగా నగరం అతలాకుతలమైంది.  ఆ భీభత్సంతో భాగ్యనగరం బాగోగుల మీద అధికార పార్టీ ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో తేట తెల్లమైంది.  అభివృద్ధి పైపైనే తప్ప క్షేత్ర స్థాయిలో జరగలేదని తెలిసొచ్చింది.  కేబుల్ బ్రిడ్జ్ లాంటివి కడితే చాలదని డ్రైనేజ్ సమస్యలను అధిగమించడం, చెరువులను కాపాడుకోవడం లాంటివి చేయాలని తెలిసొచ్చింది.  వదల దెబ్బకు నగర జనం అధికార పార్టీ మీద ఇంతెత్తున లేచారు.  అప్పటికీ తమ తప్పేం ఉందని బుకాయించారు నేతలు.  అది జనాలకు మరింత కోపాన్ని తెప్పించింది.  ఇక వరద సహాయం పంపిణీలో లీడర్ల అనుచరుల చేతివాటం కూడ జనానికి ఆగ్రహం తెప్పించింది.  ప్రధానంగా కార్పొరేటర్ల పనితీరు సున్నా అని తేలిపోయింది.  వరదల సమయంలో ఓటర్లకు భయపడి కార్పొరేటర్లు కొందరు బయటకు కూడ రాలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.  కొందరు కార్పొరేటర్ల మీద అవినీతి అభియోగాలు కూడ ఉన్నాయి.   
 
దీంతో గ్రేటర్ బాధ్యతలు చూసుకుంటున్న కేటీఆర్ రంగంలోకి దిగారు.  అభ్యర్థుల ఎంపికతోనే ఈ సమస్యను అధిగమించగలమని నిర్ణయించుకున్నారు.  నిజానికి ఆ ఆలోచన కరెక్టే.  ఎవరి మీదైతే ఓటర్లు కోపంగా ఉన్నారో తెలుసుకుని వారిని పక్కకు తప్పించి కొత్తవారిని బరిలోకి దింపి ఉంటే ఈ స్థాయి డ్యామేజ్ జరగకపోయి ఉండేది.  కేటీఆర్ హడావుడి చూసి ఈసారి ఎంపిక చాలా కఠినంగా, పక్కగా ఉంటుందని అనుకున్నారు.  కానీ గతంలో గెలిచిన 99 మందిలో 72 మందికి మళ్ళీ అవకాశం ఇచ్చారు.  సిట్టింగ్లలో మార్చిందల్లా 27 మందిని మాత్రమే.  ఇక ఆ 72 మందిలో 35 మంది అంటే దాదాపు 50 శాతం మంది ఓడిపోయారు.  అంటే కేటీఆర్ ఎంపిక చేసిన వారిలో 30 నుండి 35 శాతం మంది ఓటమి గుర్రాలే  అన్నమాట.  అక్కడే గులాబీ పార్టీకి గండం చుట్టుకుంది.  
 
కేటీఆర్ గనుక ఇంకాస్త లోతుగా విశ్లేషణ చేసి ఉంటే వ్యతిరేకత ఉన్నవారు ఇంకా ఎక్కువగా ఫిల్టర్ అయ్యేవారే.  ఏ ఎన్నికలకైనా ముందుగా సర్వేలు, అభిప్రాయం సేకరణలు చేసుకుంటారు కేసీఆర్, కేటీఆర్.  వాటిని బట్టే మార్పులు, చేర్పులు  చేసుకుని సీట్లు కేటాయిస్తారు.  ఈసారి కూడ అవి చేశారు కానీ సక్రమంగా చేసినట్టు లేదు.  అందుకే ఎల్బీ నగర, ముషీరాబాద్, ఉప్పల్, మలక్ పేట్ లాంటి ఏరియాల్లో సిట్టింగ్ అభ్యర్థులు ఓడిపోయారు.