దుబ్బాక దెబ్బకు కేసీఆర్ దిగొచ్చారా?  

KCR
ఆర్టీసీ కార్మికులు అరవై రోజులు సమ్మె చేసినపుడు కేసీఆర్ ఎలా మాట్లాడారు?  రెవిన్యూ ఉద్యోగుల విషయంలో ఎలా మాట్లాడారు?  వరదలను సరిగ్గా ఎదుర్కోలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేసినపుడు టీఆరెస్ నాయకులు, మంత్రులు ఎలా మాట్లాడారు?  ఎన్నికల ప్రచారంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎలా హూంకరించారు?  ఒకే ఒక ఉపఎన్నిక ఓటమి కేసీఆర్ లో చెప్పలేని మార్పును తీసుకొచ్చింది. 
 
KCR
KCR
 ఆర్టీసీ కార్మికులు మావాళ్లే అన్నారు…కోత పెట్టిన వారి జీతాలు తిరిగి చెల్లిస్తామన్నారు.. పారిశ్యుధ్య సిబ్బందికి జీతాలు పెంచేశారు.  అన్నిటిని మించి ఈ ఆర్ధిక సంవత్సరం ఆస్తిపన్నును యాభై శాతం తగ్గించేశారు.  ఈ చర్య మూలంగా గరిష్టంగా పదిహేనువేలు ఆస్తిపన్ను చెల్లించేవారు ఏడువేల అయిదు వందల రూపాయలు చెల్లిస్తే చాలు.  వెయ్యి రూపాయలు పన్ను చెల్లించేవారు అయిదు వందలు చెల్లిస్తే చాలు.   కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయి డబ్బులు లేక కటకటలాడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఊరట కల్పించాలని కేసీఆర్ కు ఆలోచన రాలేదు.  దుబ్బాక దెబ్బతో కలిగిన అవమానం తో పాటు  బీజేపీ మీసం మెలేస్తుండటం, మరొకపక్క మజ్లీస్ పార్టీ బీజేపీకి లోపాయికారీగా సహకరిస్తున్నదని తెలిసిపోవడంతో వచ్చే నెలలో జరగబోతున్న జి హెచ్ ఎం సి ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ లేదని పుకార్లు వినిపిస్తుండటంతో కేసీఆర్ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి.  
 
2014  తరువాత ఉపఎన్నికల్లో ఎదురులేకుండా విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులను వణికించిన టీఆరెస్ కు తొలిసారిగా దుబ్బాక రూపంలో ఆటంబాంబు పేలింది.  బీజేపీకి మెజారిటీ వెయ్యి ఓట్లే కదా అని ఉపేక్షిస్తే రేపు అవే పదివేలు కావచ్చు, ఎల్లుండి లక్ష కావచ్చు.   అందునా బీజేపీకి ఇప్పుడు ఒకప్పటిలా మితవాది లక్ష్మణ్ లాంటివారు అధ్యక్షులుగా లేరు.  అతివాదులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటివారు సారధులుగా ఉన్నారు.  వీరి నోళ్లను ఎదుర్కోవడం ఆషామాషీ కాదు.  వారికి ఎమ్మెల్యే రాజాసింగ్ కరుడుగట్టిన హిందూ వాది.  మజ్లీస్ భయంతో హిందువులు చాలామంది బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు.  కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు.  దానికితోడు జనసేన కూడా పోటీ చేస్తామని ప్రకటించింది.  కాబట్టి అధికారపార్టీ ఓట్లకు కాస్తో కూస్తో గండిపడే అవకాశం ఉన్నది.  ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని కార్పొరేషన్ భవనం మీద గులాబీ జెండా ఎగరాలంటే ప్రజలకు తాయిలాలు సమర్పించుకోక తప్పదు.  
 
దుబ్బాకలో టీఆరెస్ అభ్యర్ధే కనుక గెలిచి ఉంటే వెంటనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో ప్రత్యర్దులమీద విరుచుకుని పడేవారు.  బీజేపీ గెలవడంతో అధికారపార్టీలో భయం మొదలైంది అనేది నిజం.  ఆ ఫలితమే ఇప్పుడు  కేసీఆర్ నోట కురుస్తున్న అనుకోని వరాలు.  ఈ ఎన్నికల్లో ఏమాత్రం దెబ్బతిన్నా, గతంలో కన్నా తక్కువ సీట్లు వచ్చినా టీఆరెస్ పార్టీకి ప్రమాదఘంటికలు మోగినట్లే.  నగరంలో కాంగ్రెస్ కూడా అంతో ఇంతో బలంగానే ఉన్నది. వీరందరిని జయించి టీఆరెస్ చేతిలో కార్పొరేషన్ చిక్కడానికి కేసీఆర్ ప్రయోగిస్తున్న చిట్కాలు ఇవన్నీ.  ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి మరి.