కేసిఆర్, కేటిఆర్ నోట ఈ మాటలు దేనికి సంకేతం ?

తెలంగాణ ఉద్యమనేత, తొలి తెలంగాణ సిఎం కేసిఆర్ తన ప్రచార సరళిలో మార్పులు చోటు చేసుకున్నాయి. పరుషమైన పదజాలం వాడకుండానే బహిరంగసభలు ఖతం చేస్తున్నారు కేసిఆర్. తిట్లు, బూతు పదాలు, దూషణలు లేకుండానే ప్రసంగాలు సాగిపోతున్నాయి. దీంతోపాటు ఖానాపూర్ లో కేసిఆర్ చేసిన ఒక కామెంట్ చర్చనీయాంశమైంది. కేసిఆర్ సరే కేటిఆర్ కూడా ఒక డైలాగ్ పదే పదే వదులుతున్నారు. ఆ డైలాగ్ ద్వారా ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయాలని చూస్తున్నారు. కానీ ఆ డైలాగ్ ప్రజాస్వామ్య రాజకీయాలకు అతుకుతుందా అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.

థూ మీ బతుకులు చెడ, సన్నాసులు, దద్దమ్మలు, సంకనాకినోళ్లు, లత్కోరులు, లఫంగలు, లుచ్చాలు అనే మాటలు కేసిఆర్ నోటివెంట అలవోకగా జాలువారుతుంటాయి. ఒకటి తిట్టడం నాలుగు తిట్టించుకోవడం ద్వారానే ఇంతకాలం కేసిఆర్ రాజకీయం నడిపారు. ఉద్యమ కాలంలో ఆయన ఒకరోజు ప్రత్యర్థి పార్టీలను కడిగి పారేశేవాడు.. దాంతో వారంతా రెచ్చిపోయి వారం రోజుల వరకు కేసిఆర్ ను పొల్లు పొల్లుగా తిట్టేవారు. అంతిమంగా వారం రోజులపాటు చర్చంతా కేసిఆర్ చుట్టే తిరిగేది. దీంతో నిత్యం ప్రజల చర్చల్లో కేసిఆర్ నానుతూ ఉండేవాడు.

తెలంగాణ సిఎం అయిన తర్వాత కూడా కేసిఆర్ తిట్ల డోస్ పెంచారు తప్ప తగ్గించలేదు. ప్రతిపక్ష నేతలను పరుషమైన భాలో తిట్టిన దాఖలాలున్నాయి. ఎపి సిఎం చంద్రబాబునైతే నాలుగేండ్లు మోడీ సంక నాకినవు కదా అని ధూషించారు. కానీ ఎలక్షన్ కమిషన్ కేసిఆర్ తిట్ల భాష మీద సీరియస్ అయింది. తిట్ల భాషకు సమాధానం చెప్పాలంటూ తాఖీదులు పంపింది. దీంతోనే కేసిఆర్ భాష మార్చుకున్నారా? లేదంటే నువ్వు ఒక్కటంటే మేము పది అంటం అని ప్రతిపక్షాలు కూడా గట్టిగానే విరుచుకుపడుతున్నాయి. ఏకంగా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు పెద్దగ చేసుకుని బట్టేబాజ్, డోకేబాజ్ సిఎం అంటూ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. కారణాలేమో కానీ కేసిఆర్ భాషలో సరళత్వం వచ్చి చేరింది.

ఖానాపూర్ సభలో కేసిఆర్ నోట ఆశ్చర్యకరమైన పదాలు వచ్చేశాయి. ‘‘మహా అంటే టిఆర్ఎస్ ఓడిపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు.. ఓడిపోతే ఇంట్లో పండుకుని రెస్ట్ తీసుకుంటా’’ అని సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు ఎందుకున్నారు? కారణాలేంటి అన్నది పక్కన పెడితే తెలంగాణలో సోనియాగాంధీ జరపనున్న సభకు 24గంటల ముందు కేసిఆర్ ఈ మాటలు మాట్లాడడాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుని సోషల్ మీడియాలో సెటైర్లు, పంచ్ లు వేస్తోంది. సోనియా సభ కేసిఆర్ కు వనుకు పుట్టిస్తోందని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం విమర్శలు షురూ చేసింది.

 

ఏ సర్వే చూసినా వంద సీట్లు గ్యారెంటీ అని చెబుతున్నట్లు చెప్పే కేసిఆర్ నోట ఓడిపోతే ఇంటికాడ పండి రెస్ట్ తీసుకుంటా అన్న మాటలు ఎందుకొచ్చాయని టిఆర్ఎస్ వర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయినా ఇది యదాలాపంగానే వచ్చిన మాటలు తప్ప మరే కారణం లేదంటూ టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. 

ఇక కేసిఆర్ మాటలు ఇలా ఉంటే కేటిఆర్ పదే పదే అనేక సభల్లో తెలంగాణలో టిఆర్ఎస్ సొంతంగా అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న బుధవారం కొడంగల్ లో జరిగిన సభలో కూడా రేవంత్ రెడ్డికి ఇదే సవాల్ విసిరారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మరి కాంగ్రెస్ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకునే దమ్ము రేవంత్ కు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ ఇంకా కాంగ్రెస్ లీడర్లకు ఉందా అని కొడంగల్ గడ్డ మీద సవాల్ విసిరారు.

కేటిఆర్ సవాల్ కు ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి ధీటైన జవాబు మాత్రం రాలేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ సన్యాసం అవసరంలేదని కొందరు కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కేసిఆర్, కేటిఆర్ రాచరికం అనుకుంటున్నారు.. అందుకే రాజు యుద్ధంలో ఓడిపోతే సన్యాసం తీసుకుని రాజ్యం నుంచి పరారైపోతాడు అని కొందరు ప్రతి విమర్శలు చేశారు. ఇక రేవంత్ మాత్రం కొత్త పద్ధతిలో కేటిఆర్ కామెంట్స్ ను కౌంటర్ చేశారు. ‘‘ఓడిపోగానే అమెరికా పారిపోదామని కేటిఆర్ కలలు కంటున్నాడు కానీ… కేటిఆర్ ను అమెరికా పోనియ్యం.. చేసిన తప్పులకు మిత్తితో సహా బదులు తీరుస్తం’’ అని రేవంత్ చురకలు వేస్తున్నారు. 

మొత్తానికి కేసిఆర్ కానీ, కేటిఆర్ గానీ తమ ప్రసంగాల్లో ఈ తరహా కామెంట్స్ చేయడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.