13 ఏండ్ల తర్వాత మాట్లాడుకున్న కేసీఆర్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్, తాను 13 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నామని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యింది టిఆర్ఎస్ లోనే. అసెంబ్లీలో జగ్గారెడ్డి మెడికల్ కాలేజి గురించి అడగగానే సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సీఎం తన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం పట్ల జగ్గారెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే…

“సీఎం కేసీఆర్ , నేను 13 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం. సంగారెడ్డికి మెడికల్ కాలేజి కావాలని కోరగానే సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. మెడికల్ కాలేజి జీవో రాగానే సీఎం ను కలుస్తాను. పార్టీల కతీతంగా కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతాను. నేను మొదటి సారి ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ నుంచే ఎన్నికయ్యాను .కొన్ని కారణాలతో పార్టీ నుంచి బయటికి వచ్చాను అప్పటి నుంచి కేసీఆర్ తో మాట్లాడలేదు. 2006 తర్వాత మళ్లీ కేసీఆర్ తో ఆదివారం మాట్లాడాను. ఏపీ సీఎం చంద్రబాబు అవలంభించిన విజన్ 2020 వల్ల హైదరాబాద్ అభివృద్ది అయ్యింది. ఈ సారి ఎన్నికల్లో కూడా చంద్రబాబు మరోసారి గెలుస్తారు.” అని జగ్గారెడ్డి అన్నారు.