టిఆర్ ఎస్ కారు పుష్పక విమానం, ఎందరైనా రావచ్చు…

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్ ) ఎన్నికల  గుర్తయిన ‘కారు’ ను పుష్పక విమానంగా అభివర్ణించారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత.

‘‘ ఈ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల ఎందరు చేరినా ఓవర్ లోడ్ కాదు. కార్ వోవర్ లోడ్ అయ్యిందని అనుకుంటున్నారు, కానీ మన కారు పుస్పక విమానం..ఎందరు ఎక్కినా ఓవర్ లోడ్ కాదన్నారు, ఇంకా జాగా ఉంటుంది,’’ కవిత అన్నారు.

శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆర్మూర్ పట్టణం, ఆర్మూర్ మండలం టిఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం లో కవిత మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశానికి అతిథిగా హాజరయ్యారు.
‘పార్టీ కార్యకర్తలు కారు చక్రాల వంటి వారన్నారు. చక్రాలు తిరిగితే కారు ముందుకు కదులుతుందన్నారు. మన కారు 100 కాదు 1 వేయి కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్లాలంటే కార్యకర్తల వెన్నుదన్నుగా ఉండాలని కోరారు,’ అని ఎంపి కవిత అన్నారు.

ప్రజలే దేవుళ్ళు

తులసి మొక్కను, గోమాతను మనం పూజిస్తాము అని కానీ కేసీఆర్ కు మాత్రం ప్రజలే దేవుళ్ళని అంటారని కవిత చెప్పారు. ఉద్యమంలో కేసీఆర్ పై నమ్మకంతో వెన్నంటి నడిచిన ప్రజలు అదే నమ్మకంతో అధికారాన్ని ఇచ్చారని అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టడం , కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేయడం కోసం మన నాయకుడు కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నారని చెప్పారు.
కొందరు నాయకులు..అక్కా కాంగ్రెసోళ్ల మమ్మల్ని చూసి నవ్వుతున్నారు అని తనతో అన్నారని, మనం అధికారంలో ఉంటే మనమే బాగుపడితే మనకూ. కాంగ్రెస్లోల్లకు తేడా ఏమిటని తాను ప్రశ్నించినట్లు కవిత తెలిపారు.
గతంలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను తమ కుటుంబ సభ్యులకి..కార్యకర్తలకు ఇచ్చేవారని, దీనికి భిన్నంగా లాటరీ ద్వారా డబుల్ బెడ్ రూం ల కేటాయిస్తున్న విషయం మనందరికీ తెలుసునన్నారు.

సంపాదించి ఏమి చేసుకుంటాం..సాటి వారికి సాయపడితే ఆనందం కలుగుతుంది..నా వల్ల ఫలానా కుటుంబం బాగు పడింది..అని అనిపించినప్పుడు కలిగే తృప్తి..సంపాదన ఇవ్వలేదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. చిన్న తప్పుచేసి నా సీఎం కేసీఆర్ క్షమించరని, ఆఖరుకు తాను కూడా మినహాయింపు కాదన్నారు.
ఏ పార్టీలో ఉన్న వారయినా వారంతా తెలంగాణా వారెనన్నారు.కేసీఆర్ ఆలోచన లోంచి పుట్టే ప్రతి పథకమూ అందరికీ వర్తిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందరికీ అందాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని కవిత వివరించారు.

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ది చెందుతుంది..ఇది పార్టీ కార్యకర్తలుగా మనందరికీ గర్వకారణం అన్నారు. అందరికీ ఫలాలు అందాలి..అందులో మనం ఉండాలి..అన్నదే మన మనస్సులో ఉండాలని ఎంపి కవిత బూత్ కమిటీ సభ్యులకు ఉద్బోధించారు.
ద్రోణాచార్యుడు లాంటి గురువు మనకు కేసీఆర్ ఉన్నారన్నారు. ఆర్మూర్ లో 48 వేల మంది పార్టీ సభ్యత్వం ఉందని, రాష్ట్రం లో 75 లక్షల మంది కార్యకర్తల సభ్యత్వాలు ఉన్నాయని కవిత వివరించారు. పార్టీ కండువా ధైర్యాన్ని ఇస్తుంది..పార్టీ బలంగా ఉంటే అధికారంలో ఉంటాం..పదవులు వాటంతట అవే వస్తాయి..అని కవిత బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆషన్నగారి జీవన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పార్టీ ఇంచార్జీ తుల ఉమ, పార్టీ రాష్ట్ర నాయకులు దాదన్నగారి విఠల్ రావు, మోహన్ రెడ్డి, మధు శేఖర్, ఎలంబి రాజేశ్వర్, టీ ఎస్ రెడ్ కో చైర్మన్ ఎస్.ఏ అలిం , స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.