టిఆర్ఎస్ లో కడియం వర్గం కుదురుకున్నట్లేనా ?

కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి. ఆయన ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీగా గెలిచారు. మరి ఆయన ఈ ఎన్నికల విషయంలో గుస్సా ఉన్నట్లు వార్తలొచ్చారు. ఆయన వర్గం మనుషులు కొంతసేపు తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. వివాదం రేగింది. ముచ్చట కేటిఆర్ దాకా చేరింది. లాస్ట్ కు కేసిఆర్ దాకా చేరింది. తర్వాత మ్యాటర్ సెటిల్ అయింది. కడియం దిగొచ్చారు. స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి రాజయ్య అందరినీ కలుపుకుని పోవాలని చురకలు వేశారు. రాజయ్య గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు.

ఇక కడియం వర్గంగా భావించే మరో నాయకురాలు సత్యవతి రాథోడ్. ఆమెకు డోర్నకల్ లో టికెట్ రాలేదు. రెడ్యానాయక్ కు లభించింది. తనకు టికెట్ వస్తుందని సత్యవతి రాథోడ్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో ఆమె కాంగ్రెస్ లోకి పోతారన్న చర్చ జరిగింది. ఆమె తెలంగాణ రాకముందు టిడిపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఆమె బంగారు తెలంగాణ కోసమే టిఆర్ఎస్ లో చేరారు. స్థానిక నేత రెడ్యానాయక్ మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న ఉద్దేశంతో ఉన్న సత్యవతి రాథోడ్ తనకు టికెట్ ఖాయమనుకున్నారు. కానీ రెడ్యానాయక్ కే ఇచ్చేశారు కేసిఆర్.

కొంతకాలం సత్యవతి రాథోడ్ కూడా పార్టీ మారుతారని ప్రచారం సాగినా అవన్నీ పటాపంచలు చేస్తూ ఆమె డోర్నకల్ టిఆర్ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని ప్రకటించారు. అధిస్టానం మాటకు కట్టబడి పనిచేస్తానన్నారు. ఇలా కడియం వర్గం తమ అసమ్మతి రాగాన్ని కొద్దిరో్జుల్లోనే ఆలపించడం మానేసి పార్టీ కోసం సని చేయడం షురూ చేశారు. 

డోర్నకల్ సమావేశంలో మాట్లాడుతున్న కడియం, పక్కన సత్యవతి రాథోడ్

డోర్నకల్ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో శుక్రవారం పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్, పార్టీ ముఖ్య నేత నూకల నరేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అభ్యర్థి రెడ్యానాయక్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థిగా నా గెలుపు కోసం పనిచేసే వారందరిని కాపాడుకుంటాను అన్నారు. గెలిచి వారికి సేవ చేసుకుంటానని, అందరి సమన్వయంతోనే భారీ మెజారిటీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నాకోసం పని చేసేందుకు కలిసి వచ్చిన అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. 

సమన్వయ సమావేశంలో ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. మళ్ళీ టి.ఆర్.ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో అందరి ప్రశంసలు పొందాయన్నారు.  

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ 17.7 శాతం అభివృద్ది రేటుతో ముందంజలో ఉందన్నారు. తెలంగాణ ప్రజల కష్ట, సుఖాలు తెలిసిన వ్యక్తిగా ఎవరు ఊహించని పథకాలు సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని కొనియాడారు. కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, కేసీఆర్ కిట్లు ఇలాంటి పథకాలు ఏనాడైనా ఊహించామా అని ప్రశ్నించారు. 

కడియం సభకు హాజరైన టిఆర్ఎస్ కార్యకర్తలు

డోర్నకల్ లో టి.ఆర్.ఎస్ పార్టీ సత్యవతి రాథోడ్ రాకతో గోదావరిలో ప్రాణహిత వచ్చి చేరినట్లు, రెడ్యానాయక్ రాకతో ఇంద్రవతి కలిసినట్లు గా ఉగ్ర గోదావరి నదిగా ఉందన్నారు. నిండు గోదావరి వలె ఇప్పుడు డోర్నకల్ లో టి.ఆర్.ఎస్ పార్టీ కూడా నిండుగా ఉందని, అన్ని నదులు కలిసిన గోదావరి వలే అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసిన పార్టీగా టి.ఆర్.ఎస్ ఉందన్నారు.

పార్టీ అభ్యర్థిగా రెడ్యా నాయక్ అన్ని వర్గాలను కలుపుకొని పోయి, సమన్వయం చేసుకొని భారీ మెజారిటీ సాధించాలన్నారు. భవిష్యత్ లో కూడా అందరికి అవకాశాలు కల్పించాలన్నారు. 

స్థానిక ఎంపీ సీతారాం నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ పరిశీలకులు, ఐఐసి చైర్మన్, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలమల్లు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు.