నాకు సువ్వలు చూపిన కేసిఆర్ కు చుక్కలు చూపిస్తా : జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేత, మాజీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చంచల్ గూడ జైలు నుంచి సోమవారం సాయంత్రం రిలీజ్ అయ్యారు. ఆయనకు సికింద్రాబాద్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి నేరుగా గాంధీభవన్ వచ్చిన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగ్గారెడ్డి గతంలో మాదిరిగా దూకుడుగా మాట్లాడకపోయినా పంచ్ డైలాగులు పేల్చారు. రానున్న రోజుల్లో కేసిఆర్ కు చుక్కలు చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ప్రెస్ మీట్ లో జగ్గారెడ్డి ఏం మాట్లాడారో చదవండి.

14 ఏండ్ల కిందటి కేసును తిరగదోడి నన్ను అరెస్టు చేశారు. ఆ కేసులో అసలు అందులో నా పేరు లేదు. 

నన్ను రాజకీయంగా దెబ్బ తీసేందుకే అరెస్టు చేశారు. 

14 సంవత్సరాల తర్వాత పోలీసులు ఈ కేసును తిరగదోడారు.

నేను తప్పు చేసిన్నా, లేదా అన్నది న్యాయస్థానం వెల్లడిస్తది. 

కాంగ్రెస్ పక్షాన నేను తెలియజేసేదేమటే రాజకీయంగా ప్రజల మన్ననలు పొందిన వారిని కేసులపాలు చేయాలని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. 

కేసిఆర్ నీ 60 ఏళ్ల జీవిత చరిత్రలో ఎలాంటి తప్పు చేయలేదా? ఎలాంటి అవినీతికి పాల్పడలేదా? మీ మీద ఎలాంటి ఆరోపణలు లేవా?

నెలరోజులైతే ఎన్నికలు ఉండంగ వెతికి వెతికి కాయితం పట్టుకొచ్చి నన్ను అరెస్టు చేసిర్రు.

ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడమే నేరమా?

ఏడాది కిందట రాహుల్ గాంధీ సభ జరిపిన. 

సంగారెడ్డిలో కార్యక్రమాలు చేస్తున్నడు అని టార్గెట్ గా పెట్టుకుని కేసిఆర్ కుటుంబం నన్ను జైలుకు పంపిర్రు.

ప్రజా జీవితంలో ఉన్న మేము ప్రభుత్వం ఏదైనా ప్రజలకు చేయకపోతే అడగడమే తప్పా? అడగొద్దా? 

ఉద్యోగాలు రాలేవని ఉద్యమాలు చేయొద్దా?

మహిళా గ్రూపులకు రుణమాఫీ జరగలేదని అడగొద్దా?

రైతుల రుణమాఫీ జరగలేదని కూడా అడగొద్దా?

రాష్ట్రంలో, దేశంలో తప్పులు చేయని నాయకుడే లేడన్నట్లు, జగ్గారెడ్డే తప్పు చేసినట్లు కేసులు పెట్టి జైల్లో పెడతారా?

ప్రతిపక్ష పార్టీ అంటూ లేకపోతే నష్టపోయేది ప్రజలే కదా? 

మేము ఏం మాట్లాడొద్దు అంటే ఎలా?

కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడొద్దు.. మాట్లాడితే కేసులా?

రేపు మేము ప్రభుత్వంలోకి వస్తాము. మేము కూడా ఇలాగే చేయాలా? ఇదేనా సాంప్రదాయం.

ఇది మంచి సాంప్రదాయా కాదని నేను కేసిఆర్ కుటుంబానికి తెలియజేస్తున్నాను.

నాలుగేళ్లు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చిర్రు కదా? నాలుగేండ్లు లేనిది ఇప్పుడే నేను తప్పు చేసిన్నా? 

రాష్ట్రంలో తెలిసో, తెలియకో ఎక్కడో నాయకుడు తప్పులు చేస్తరు. ఆ తప్పులు చూపి జైల్లో పెడితామంటే ఎలా?

బ్లాక్ మెయిల్ చేస్తే ప్రజాస్వామ్యం బతికే చాన్స్ ఉంటదా?

దయచేసి ప్రజలు గమనించాలి. పోలీసు అధికారులు గమనించాలి. 

పోలీసు అధికారులు పక్షపాతంగా పోవద్దు. ప్రభుత్వం చెప్పింది కదా అని పోవద్దు.

ప్రజాస్వామ్య పద్ధతిలో పనులు చేద్దాం. పోటీ పడదాం. ఇలా కేసులతో భయబ్రాంతులకు గురిచేద్దామని చూస్తే బాగుండదు. 

మాకూ భార్యాపిల్లలు ఉన్నారు. మాకూ కుటంబాలు ఉన్నాయి.

మేము ప్రజల పక్షాన మాట్లాడినందుకే కేసులు పెట్టారు. దయచేసి ప్రజలు గమనించాలి.

రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడవద్దని టిఆర్ఎస్ కు విన్నవిస్తున్నాను.

తప్పకుండా కేసిఆర్ కు చుక్కలు చూపిస్తానని తెలియజేస్తున్నాను.

నేను ఎవరి కడుపు కొట్టలేదు. ఎవరిని మోసం చేయలేదు.

ఏది ఏమైనా నాకు కేసిఆర్ 13 రోజులు చుక్కలు చూపించిండు.

నాకు నా ప్రజల మద్దతుతో రానున్న ఎన్నికల్లో కేసిఆర్ కు, ఆయన కుటుంబానికి చుక్కలు చూపిస్తాను.

కాంగ్రెస్ నేతలను హింస పెట్టొద్దు. ఎవరిని కడుపు కొట్టలేదు. ఎవరిని దోపిడి చేయలేదు.

ఎన్నికలు నెలరోజుల ముందే అరెస్టులు చేశారు. జగ్గారెడ్డి ఇంత ధైర్యంగా మాట్లాడేవాడిని. నన్ను ఈ కేసులు పెట్టి భయపడే పరిస్థితి తీసుకొచ్చిండు.

రేపు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం నాశనం అయిపోతది. ప్రతిపక్షాలు భయపడే పరిస్థితి తెచ్చిండు కేసిఆర్.

నామీద తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని నా అభిమానులకు తెలియజేస్తున్నాను.

నావల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కష్టం కలగొద్దని రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను.