టిఆర్ఎస్ పార్టీలో చేరిక పై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తల పై ఆయన స్పందించారు. తనను టిఆర్ఎస్ లోకి రావాలని ఎవరూ ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారంటే..

“గత కొన్ని రోజులుగా నేను టిఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రచారం జరుగుతోంది. అజ్ఞాతంలోకి వెళ్లానని అందుబాటులో లేనని వార్తలు వచ్చాయి. నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు. వ్యక్తిగత పని మీద ఉండడంతో అందుబాటులో లేను. నన్ను పార్టీ మారాలని ఎవరూ కలవలేదు. నేను వస్తానన్న వారు తీసుకోరు. ఎందుకంటే నేను వారు చెప్పిన మాట వినను కాబట్టి.

నేను ప్రజల పక్షాన ఉంటా. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పై పోరాటం చేస్తాను. కాంగ్రెస్ నుంచి కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. ఎవరు ఉన్నా పోయినా సరే.. భవిష్యత్తు కాంగ్రెస్ దే. 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులొస్తాయి. నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదు” అని జగ్గారెడ్డి అన్నారు.