హారీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జగ్గారెడ్డి

టిఆర్ఎస్ కీలక నేత హారీష్ రావు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగూరు నీటిని దోపిడి చేసి సంగారెడ్డి ప్రజల గొంతులను హారీష్ రావు ఎండబెట్టాడని విమర్శించారు. కేటాయింపులు లేకపోయినా శ్రీరాం సాగర్ కు కేటాయించారని దీని వెనుక రాజకీయ కోణం ఉందని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగ్గారెడ్డి ఏమన్నారంటే…

“హారీష్ రావు సింగూరు నీటిని దోపిడి చేసి సంగారెడ్డి ప్రజల గొంతును ఎండబెట్టాడు. శ్రీరాం సాగర్ కు అసలు నీటి కేటాయింపులే లేవు. అయినా నీటి కేటాయింపులు చేశాడు. కేసీఆర్ కుటుంబ సభ్యుడు కావడంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోయారు. కేసీఆర్ కు చెడ్డ పేరు తీసుకొచ్చేలా హరీష్ రావు నిర్ణయం ఉంది. హారీష్ రావు ఈ నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఉంది. అది కేసీఆర్ కు అర్దమవుతలేదు. వాస్తవానికి నీటి కేటాయింపుల విషయం కేసీఆర్ కు తెలియదు. ఇలా సింగూరు నీటిని శ్రీరాం సాగర్ కు కేటాయించారని తెలిస్తే కేసీఆర్ ఊరుకోరు. కేసీఆర్ కు తెలియకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం హారీష్ కు ఎందుకు వచ్చింది.

ఇలాంటి విషయాలను తాను అడుగుతాననే హారీష్ రావు సంగారెడ్డిలో నన్ను గెలవకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హారీష్ రావు ఇలా అనేక దారుణాలు చేశాడు. ఒక ప్రాంతం అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని మిగిలిన ప్రాంతాలకు అన్యాయం చేయడం సరైనది కాదు. మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా సమానంగా చూడాలి. నాకు హారీష్ రావు పై పలు అనుమానాలు ఉన్నాయి. 

కనీసం ముఖ్యమంత్రికి తెలుపకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక హారీష్ రావు కొత్త రాజకీయ కోణం కనిపిస్తుంది. దీని పై కేసీఆర్ అలర్ట్ అయితే మంచిది. లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది తప్పక పోవచ్చు. నేను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాక నియోజకవర్గానికి సంబంధించి పలు సమీక్షలు చేశాను . ఇలా ఒక్కోటి బయటపడుతున్నాయి. ఏదేమైనా సరే హారీష్ రావు చేసిన పని తప్పు. అతను వెంటనే సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.” అని జగ్గారెడ్డి అన్నారు.

జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు టిఆర్ ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్, హారీష్ రావు ల మధ్య దూరం పెరిగిందని వార్తలు వస్తున్నాయి. దీంతో జగ్గారెడ్డి వ్యాఖ్యలు మరింత దూరం పెంచేలా ఉన్నాయని పలువురు నాయకులు చర్చించుకున్నారు. ఇటీవల జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను సీఎంని కాని, ప్రభుత్వాన్ని కానీ విమర్శించనని అన్నారు.  అయితే ప్రస్తుతం జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని అంతా చర్చించుకుంటున్నారు.

 మరో వైపు జగ్గారెడ్డి టిఆర్ఎస్ లో చేరుతారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆయన సీఎం కేసీఆర్ ని ప్రసన్నం చేసుకునేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టిఆర్ఎస్ నేతల ద్వారా తెలుస్తోంది. మరి జగ్గారెడ్డి వ్యాఖ్యల పై హారీష్ రావు ఏ విధంగా స్పందించనున్నారో చూడాలి.