హరీష్ రావు పై మరోసారి ఫైర్ అయిన కాంగ్రెస్ జగ్గారెడ్డి

టిఆర్ఎస్ నేత హారీష్ రావు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మండిపడ్డారు. హరీష్ రావు తన విమర్శలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదో అర్థం కావడం లేదన్నారు. దీన్ని బట్టి హారీష్ రావు తప్పుచేశాడని స్పష్టమైందన్నారు. జగ్గారెడ్డి పదే పదే హరీష్ రావును టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.  జగ్గారెడ్డి ఏమన్నారంటే…

“హరీష్ రావు మంత్రిగా ఉన్న కాలంలో అత్యుత్సాహంగా సింగూరు నీళ్లను మళ్లించారు. దీంతో ప్రస్తుతం ఏడుపాయల జాతరకు నీళ్లు లేవు. దీని పై హరీష్ రావు భక్తులకు ఏం సమాధానం చెబుతారు. హరీష్ రావు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తనను రాజకీయంగా అణగతొక్కేందుకు హారీష్ రావు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా కూడా నేను గెలవగలిగాను. ప్రజలంతా నన్ను నమ్మి అవకాశమిచ్చారు. ఇక్కడ హారీష్ రావు కుయుక్తులు పని చేయలేదు. అంతట తనదే నడుస్తుందనుకుంటే పొరపాటే.

హరీష్ రావు మెదక్ ప్రజలను మోసం చేశారు. సింగూరు జలాలను ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా మళ్లీంచాల్సిన అవసరమేమొచ్చింది. దీనిలో ఏదో కుట్ర ఉంటేనే కదా చేసేది. అందుకే ఈ సారి సీఎం మంత్రి పదవి ఇవ్వకుండా ఆపాడు. హరీష్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక అక్రమాలు జరిగాయి. తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే అవకాశాలు ఇచ్చి తెలంగాణను దోచుకున్నాడు.

చాణక్యనీతితో ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఉత్తమ్ కుమార్ రెడ్డిది అమ్ముడు పోయే మనస్తత్వం కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లినా అది వారి ఆర్ధిక బలహీనతతోనే తప్ప మరొకటి కాదు” అని జగ్గారెడ్డి అన్నారు.