రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తున్నారా ? సెంటిమెంటే దిక్కా ?

భీమవరం అసెంబ్లీకి నామినేషన్ వేసిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. కెసియార్ ఏపి జనాలను తుడుతున్నారట. అందుకు వైసిపి నేతలకు పౌరుషం లేదా ? అంటూ పవన్ నిలదీయటం విచిత్రంగా ఉంది.  ‘కెసియార్ అండ్ కో ఆంధ్రులను అంత హీనంగా తిడుతుంటే, మీరు ఆంధ్రుల పుట్టుకే పుట్టుంటే మీకు పౌరుషం రాలేదా ?’ అని ప్రశ్నించారు. నిజానికి ఉద్యమ సమయంలో కెసియార్ ఆంధ్ర సంస్కృతిని, తిండి గురించి చాలా నీచంగా మాట్లాడిన మాట వాస్తవమే.  

ఎన్నికలైపోయిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కెసియార్ ఏపి జనాలను మాత్రం ఏమనలేదు. ఎప్పుడో అన్న మాటలను పట్టుకుని ఇపుడు పవన్ జనాలను రెచ్చగొడతున్నారంటే ఏమనుకోవాలి ? అంతెందుకు, ఏపి సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడిన తర్వాత ఇదే పవన్ కల్యాణ్ ఏం చేశారు ? ఏమీ చేయలేదు. పైగా కెసియార్ ఇంటికెళ్ళి భోజనం కూడా చేసొచ్చారు.

ఇక చంద్రబాబునాయుడు గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. కెసియార్ చేసిన యాగానికి వెళ్ళొచ్చారు. అంతుకుముందు అమరావతి శంకుస్ధాపనకు కెసియార్ ను స్వయంగా వెళ్ళి ఆహ్వానించారు. ఇద్దరు కలిసి భోజనాలు కూడా చేశారు. అప్పట్లో కెసియార్ మాటలు ఇటు చంద్రబాబుకు అటు వపన్ కు ఏమాత్రం గుర్తుకురాలేదా ? వాళ్ళు ఆంధ్రులు కారా ? వాళ్ళల్లో ఆంధ్రుల పౌరుషం లేదా ?

ఎప్పుడో కెసియార్ మాట్లాడిన మాటలను ఇపుడే చంద్రబాబు, పవన్ ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు ? ఎందుకంటే, ఎన్నికల్లో లబ్దిపొందటానికే అన్నది స్పష్టంగా అర్ధమవుతోంది. సెంటిమెంటును రెచ్చగొడితే కానీ తమకు జనాలు ఓట్లేయరని అనుకున్నారేమో ? అందుకనే  పదే పదే రోడ్డు షోల్లో, బహిరంగసభల్లో కెసియార్ కు వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీళ్ళ ట్రాప్ లో జనాలు పడతారా ? లేదా ? అన్నది చూడాల్సిందే.