అర్రే .. కరక్కాయలు కొంప ముంచుడు ఏందబ్బా?

కరక్కాయ పొడి ఆశ వారి నోట్లో వెలక్కాయ పడేసింది. రూ.1000 రూపాయల పెట్టుబడితో 1300 వందల రూపాయలు సంపాదించుకోవచ్చన ఆశ వారిని నిరాశకు గురి చేసింది. హైదరాబాద్ కూకట్ పల్లిలో కరక్కాయల భారీ స్కాం బయటపడింది. పెట్టుబడి పెట్టిన   కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..

హైదరాబాద్ కూకట్ పల్లిలోని రోడ్ నంబర్ 1 లో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ కంపెనీ ప్రారంభమైంది. దీనికి మేనేజరుగా ఏపికి చెందిన ముప్పాలా మల్లిఖార్జున్ వ్యవహరించాడు. కరక్కాయల వ్యాపారంతో ఓ టివి ఛానల్ లో వీరు ప్రకటనలు  కూడా ఇచ్చారు. ఈ ప్రకటనను చూసి చాలా మంది నిజమే అని భావించి డబ్బులు చెల్లించి కరక్కాయలు కొని తీసుకెళ్లారు. ఈ పొడిని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తాం అంటూ వారిని నమ్మించింది. అలా దాదాపు రూ. 5కోట్లు వసూలు చేసింది. మే నెలలో ప్రారంభమైన కంపెనీ మొదటి రెండు నెలలు సక్రమంగానే వారికి చెల్లింపులు చేసింది.

ఇంతలోనే కంపెనీ మరో ఆఫర్ ను ప్రకటించింది. కిలోకు వెయ్యి చొప్పున ఓకే సారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే అదనంగా మరో 50 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో ఇంటి దగ్గర ఉన్న మహిళలు ఇది తమకు ఉపాధిగా మారుతుందని భావించి అధిక సంఖ్యలో పెట్టుబడులు పెట్టారు. ఒకతను అయితే ఏకంగా రూ.40 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టారు. ఆఫీసుకు ఫోన్ చేయగా ఫోన్ మోగలేదు. హెచ్ ఆర్ గా పనిచేసే ప్రసన్న  అనే అమ్మాయి ఆఫీసుకు వచ్చి  చూడగా బోర్డులేదు, ఆఫీసుకు తాళాలు ఉన్నాయి. దీంతో ఖంగుతిన్న ఆమె వెంటనే కస్టమర్లకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో భారీ  సంఖ్యలో అక్కడకు చేరుకున్న  బాధితులు కూకట్ పల్లి  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

వరంగల్ లో కూడా కరక్కాయల ముఠా మోసం బయటపడింది. ఇదే తరహాలో అక్కడ కూడా మోసం చేయడంతో అక్కడ ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారికి, హైదరాబాద్ లో జరిగిన మోసానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయ అనే కోణంలో వారు విచారిస్తున్నారు. హైదరాబాద్ లో కరక్కాయ బాధితులు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కేసు తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. కరక్కాయ మోసాగాడు దొరికేనా… మాకు  న్యాయం జరిగేనా అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.