Hyderabad: భాగ్యనగరంలో మరో అద్భుతం… నగర ప్రజల చెంతకు ఫార్ములా-E రేసింగ్

Hyderabad is all set to host the Formula E World championship

Hyderabad: హైదరాబాద్ నగరం మరో అద్భుతానికి వేదిక కానుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్ సంస్థ అత్యంత పర్యావరణ అనుకూల కార్లతో ప్రతి ఏడాది నిర్వహించే “ఫార్ములా-E” ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఈవెంట్ కు ఆతిధ్యమిచ్చేందుకు భాగ్యనగరం అర్హత సాధించింది. ఇప్పటికే ఈవెంట్‌ను నిర్వహిస్తున్న న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్ మరియు సియోల్ ఎలైట్ క్లబ్‌లో చేరనుంది.

ప్రముఖ వ్యాపారవేత్త, ఫార్ములా-E సభ్యుడైన ఆనంద్ మహీంద్రా ఈ ఈవెంట్ ను ఇండియాకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. హైదరాబాద్‌ తో పాటు న్యూఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు వంటి మెట్రో నగరాలను ఆయన కమిటీకి సిఫార్సు చేయగా అన్ని నగరాలను సందర్శించిన కమిటీ చివరకు హైదరాబాద్ కు మొగ్గు చూపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఫార్ములా-E సంస్థ, గ్రీన్‌ కో సంస్థల మధ్య ఈ రోజు త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.

ఫార్ములా-E కి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఫార్ములా-1 రేసులకు అవసరమయ్యే ప్రత్యేక ట్రాక్ లు నిర్మించాల్సిన పని లేదు. సిటీ రోడ్ల మీద ఈ రేసింగ్ ను జరిపించొచ్చు. ఇటీవల ఫార్ములా-E బృందం ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు, జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఉన్న సర్క్యులర్‌ రోడ్డు, గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్డును సందర్శించింది. ఈ బృందం సూచించిన చోట రోడ్లను విస్తరించడం, కావలిసిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ట్రాక్ పొడవునా అక్కడక్కడ ప్రేక్షకులు వీక్షించేందుకు వీలుగా వసతి ఏర్పాటు చేయటం వంటి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.

“భూ గ్రహం మీద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మోటార్ స్పోర్ట్ ‘ఫార్ములా-E’ సిరీస్ హైదరాబాద్ కు రానుందని, ఇది ఎలక్ట్రానిక్ వెహికల్స్ అభివృద్ధికి, కొత్త డీకార్బనైజ్డ్ సస్టైనబుల్ ఫ్యూచర్‌ కి, తెలంగాణను ఆదర్శ EV హబ్‌గా మారటానికి నాంది అవుతుందని గట్టిగా నమ్ముతున్నానని” కేటీఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. లుంబినీ పార్క్, సెక్రటేరియట్ కాంప్లెక్స్ మరియు చుట్టుపక్కల 2.37 కి.మీ ట్రాక్‌ పై రేస్ జరుగుతుందని సమాచారం.