పీసీసీ ఫైట్‌: అస్త్రాల్లేని ఆ యోధుడెవరో మరి.!

Huge competition for Telangana PCC seat

తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది. యోధానుయోధులు యుద్ధంలో తలపడుతున్నారు. అందరూ యోధులే.. కానీ, అస్త్రమంటూ లేని పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోరాడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి నిర్ణయాలన్నీ ఢిల్లీ స్థాయిలో జరిగిపోతాయి. పీసీసీ అధ్యక్షుడంటే నిమిత్తమాత్రుడు మాత్రమే. అలాంటి పదవి కోసం పోటీ అంటే, అది కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి. ఇంతకీ ఆ పదవిలో ఏముంది.? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం సాధించారు ఇప్పటిదాకా ఈ పదవి ద్వారా.? కొత్తగా ఆ పదవిలో కూర్చునే వ్యక్తి ఏం సాధిస్తారు.! ఇది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు.

Huge competition for Telangana PCC seat
Huge competition for Telangana PCC seat

నేతలున్నారు, కార్యకర్తలున్నారు.. ప్రజలే పట్టించుకోరు.!

కాంగ్రెస్‌ పార్టీకి బోల్డంతమంది నేతలున్నారు.. కార్యకర్తలూ వున్నారు. పాపం, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలే పట్టించుకోవడంలేదు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితేంటో చూశాం. అంతకు ముందు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఏమయ్యిందో చూశాం. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం, కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని బాగానే చాటుకుంది. అయినాగానీ, కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదే. పీసీసీ అధ్యక్షుడి, ఓ ఛోటా నాయకుడు కూడా లెక్కచేయడు. అదే కాంగ్రెస్‌లోని అంతర్గత ప్రజాస్వామ్యమంటే.

ఏ రెడ్డికి దక్కుతుందో పీసీసీ పదవి.!

రేసులో రేవంత్‌ రెడ్డి వున్నారు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నారు.. జగ్గారెడ్డి కూడా తానూ వున్నానంటున్నారు. కానీ, ఏ రెడ్డిని ఆ పదవి వరిస్తుందో తెలియదు. అసలు రెడ్డి సామాజిక వర్గానికి పదవి దక్కుతుందా.? లేదా.? అన్నదానిపైనా సస్పెన్స్‌ వుంది. ఆశావహులంతా ఢిల్లీకి పరుగులెడుతున్నారు. అభిప్రాయ సేకరణ ఇప్పటికే పూర్తయ్యింది.. ఈ హైడ్రామాకి ముగింపు ఢిల్లీలో పడనుంది.

పీఠమెక్కేదెవరు.? పార్టీని గెలిపించేదెవరు.?

ఎవరు పీఠమెక్కినా, కాంగ్రెస్‌ పార్టీని ఉద్ధరించేంత సీన్‌ మాత్రం ఎవరికీ వుండదు. ఎందుకంటే, కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అలాంటిది మరి. ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కినా, ఓ డజను మంది ముఖ్య నేతలు, వేరే పార్టీల్లోకి జంప్‌ చేయడం ఖాయమట. ఆ మంచి ముహూర్తం కోసం సదరు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఎదురుచూస్తున్నారు. వాళ్ళెవరన్నదానిపై కాంగ్రెస్‌ అధిష్టానానికీ ఓ ఐడియా వుంది. కానీ, తప్పదు.. హైడ్రామా నడవాల్సిందే.