Harish rao: తెలంగాణాలో బూస్టర్ డోస్ పంపిణీ షురూ… అర్హులందరూ తీసుకోవాలి

Health Minister Harish Rao inaugurated the booster dose distribution program

Harish rao: కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ చార్మినార్ యునానీ ఆస్పత్రి‌లో బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి గారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో వాక్సినేషన్ పక్రియ విజయవంతంగా సాగుతుందని వెల్లడించారు. ప్రజలకు వాక్సిన్, బూస్టర్ డోసుల మీద అపోహలు వద్దని, మరిన్ని ప్రయోజనాలు ఈ టీకాతో ఉన్నాయని తెలిపారు. అర్హులందరూ బూస్టర్ డోసును తీసుకోవాలని సూచించారు.

తెలంగాణాలో ఫస్ట్ డోస్ 102 శాతం, సెకండ్ డోస్ 78 శాతం పూర్తయ్యాయని చెప్పారు. దేశంలోనే వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ రాష్ట్రం ముందజలో ఉందన్నారు. రాష్ట్రంలో వాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసే దిశగా తెరాస ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన హెల్త్, పోలీసు సిబ్బందికి ముందుగా బూస్టర్‌ డోస్‌ ను అందిస్తున్నామని తెలిపారు. అరవైఏళ్ళు నిండి, దీర్ఘకాల వ్యాధులున్నవారు కూడా భయపడకుండా బూస్టర్ డోసును తీసుకోవచ్చన్నారు.

అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారని అన్నారు. కరోనా నుండి మాస్క్, వ్యాక్సిన్ మాత్రమే మనల్ని రక్షిస్తాయని అన్నారు. యునానీ ఆస్పత్రిలోని సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, త్వరలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటుగా ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ బలాలా, ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.