కేటిఆర్ కు వర్కింగ్ ప్రసిడెంట్ పోస్ట్, హరీష్ రావ్ రియాక్షన్ ఇదే

తెలంగాణ ముందస్తు ఎన్నికల ముహూర్తం ఏ గడియలో పెట్టారో కానీ కేసిఆర్ అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసిఆర్ కు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఓట్లు గుద్దుడు గుద్దితే కూటమి మటాష్ అయింది. ఇక ఆ ఫలితాల నేపథ్యంలో కేసిఆర్ తన ప్రణాళికను వేగంగా అమలు చేస్తున్నారు. వరుస నిర్ణయాలతో కేసిఆర్ హల్ చల్ చేస్తున్నారు. 

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే తన తనయుడు  కేటిఆర్ ను టిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని నడపగల సమర్థుడు, నమ్మకమైన వ్యక్తి కావడంతోనే కేటిఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఫెడరల్ ఫ్రంట్ యాక్టివిటీని సక్సెస్ ఫుల్ గా జరపడం కోసం కేసిఆర్ ఢిల్లీ లో మకాం వేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కూడా ఇచ్చారు. అందుకోసమే తొలి మెట్టు లో భాగంగానే కేటిఆర్ కు వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

కేటిఆర్ కు వర్కింగ్ ప్రసిడెంట్ పదవి ఇవ్వగానే పార్టీ నేతలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేటిఆర్ ను అభినందించేందుకు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుని కంగ్రాట్స్ చెప్పారు. పార్టీలో ఒక కొత్త వాతావరణం నెలకొంది. ఇక మీదట కేసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించనుండగా కేటిఆర్ రాష్ట్ర పాలన వ్యవహారాలు, పార్టీ మంచి చెడ్డలు చూసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేటిఆర్ కు పదవి ఇవ్వగానే ఆయన తొలుత పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ఇంటికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. మంచి చెడ్డ మాట్లాడారు. కేశవరావు ఆశిస్సులు తీసుకున్నారు. అక్కడ ినుంచి నేరుగా హరీష్ రావు ఇంటికి వెళ్లారు కేటిఆర్. అక్కడ హరీష్ రావు ఆశిస్సులు కూడా తీసుకున్నారు. కేటిఆర్ కు పదవి కట్టబెట్టిన కొద్దిసేపటికే హరీష్ రావు ట్విట్టర్ లో కేటిఆర్ ను అభినందించారు. హార్ట్ లీ కంగ్రాజులేషన్స్ అంటూ ట్వీట్ చేశారు. హరీస్ రావు ట్వీట్ కు కేటిఆర్ ‘‘మెనీ థాంక్స్ బావా’’ అని రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా హరీష్ రావు ఇంటికి వెళ్లి ఆయన ఆశిస్సులు కూడా తీసుకున్నారు.

 

కేటిఆర్ ను కౌగిలించుకున్న హరీష్ రావు

హరీష్ రావు ఇంటికి కేటిఆర్ వెళ్లగానే హరీష్ రావు ఆయనకు అభినందనలు తెలిపారు. కేటిఆర్ ను కౌగిలించుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కేటిఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని హరీష్ రావు ఆకాంక్షించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేశామని, రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో కూడా కలిసి పనిచేస్తామన్నారు. కేసిఆర్ కు కేటిఆర్ చేదోడువాదోడుగా ఉండాలని ఆకాంక్షించారు. పంచాయతీ ఎన్నికల్లో కేటిఆర్ కు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. 

 

ఎన్నికల ముందు వరకు టిఆర్ఎస్ పార్టీలో కేసిఆర్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 ఎవరు అన్న చర్చ ఉండేది.  నెంబర్ టూ ఎవరూ లేరని కూడా అనేవారు. అయితే నెంబర్ 2 రేంజ్ లో ఆ పార్టీలో పలుకుబడి ఉన్న వారిలో కేటిఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ ఉండేవారు. ఇప్పుడు ఆ చర్చకు ఇక పులిస్టాప్ పెట్టేశారు కేసిఆర్. తన వారసుడు కేటిఆరే నెంబర్ 2 అని ఎన్నికల ఫలితాలు వెలవడిన వెంటనే అనౌన్స్ చేశారు. ఈ పరిణామం ఇంతవరకేనా? లేదంటే పార్లమెంటు  ఎన్నికలకు అటూ ఇటూగా కేటిఆర్ ను తెలంగాణ సిఎం కుర్చీలో కూర్చోబెడతారా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ శుభ గడియాలు కూడా ఎంతో దూరంలో లేవు అని రంగారెడ్డి జిల్లాకు చెందిన కేటిఆర్ అభిమాని ఒకరు వెల్లడించారు. సో ముందస్తు ఎన్నికల వేళ టిఆర్ఎస్ లో అనూహ్య మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నమాట.

కేటీఆర్‌కు అభినందనలు తెలిపిన ఎంపీ సంతోష్‌కుమార్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి కేటీఆర్‌‌కు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించిన సీఎం కేసీఆర్ కు ఎంపీ సంతోష్‌కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.  గత మూడేళ్లుగా ఉప ఎన్నికలలో, జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంలో సమర్థుడైన యువ నాయకుడు కేటీఆర్ కీలక పాత్ర పోషించారని ఎంపీ సంతోష్ అన్నారు. 

సంతోష్ కుమార్, టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు

కేటీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ మున్ముందు మరిన్ని విజయాలను నమోదు చేస్తుందనడంలో సందేహం లేదని, పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కేటీఆర్ నాయకత్వంలో 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఎంపీ సంతోష్ ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఇంకా కేటిఆర్ నియామకంపై కేసిఆర్ కుమార్తె, ఎంపి కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది.