లగడపాటి సర్వే పై హరీష్ రావు హాట్ కామెంట్స్

లగడపాటి రాజగోపాల్ సర్వే పై మంత్రి హారీష్ రావు ఫైర్ అయ్యారు. లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల  సర్వే ఫలితాలను మంగళవారం రాత్రి ప్రకటించారు. ఇందులో కూటమికే అనుకూలంగా ఉందంటూ రాజగోపాల్ ప్రకటించారు. దీంతో టిఆర్ఎస్ నేత, మంత్రి హారీష్ రావు లగడపాటి సర్వే ఓ జోక్ అని దానిని నమ్మాల్సిన పని లేదన్నారు. లగడపాటి రాజగోపాల్  సర్వే పై మంత్రి హారీష్ రావు ఏమన్నారంటే…

“లగడపాటి జోకర్ లా తయారయ్యారు. అసలు లగడపాటి రహస్య అజెండా ఏమిటో అర్ధం కావటం లేదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రకటించడం లగడపాటి అజెండానా? పోలింగ్ తర్వాత సర్వే ఫలితాలు చెప్తా అని ప్రకటించి ఇప్పుడెందుకు ప్రకటించారు. సర్వేలో విశ్వసనీయత ఉంటుంది, ఓటర్లను ప్రభావితం చేయదని చెప్పి ఇలా ఎందుకు టర్న్ తీసుకున్నారు. సీఎం అభ్యర్దులుగా చెప్పుకునే కాంగ్రెస్ నేతలు నియోజకవర్గం దాటి బయటికి రావడం లేదు. ఓడిపోతామని కాంగ్రెస్ నేతలకు చెమటలు పడుతున్నాయి. పిసిసి చీఫ్ కూడా హూజుర్ నగర్ దాటి బయటకు రావడం లేదు. ఉత్తమ్ ఓడిపోతుంటే లగడపాటి ఏం సమాధానం చెబుతారు. “  అని హారీష్ రావు మండి పడ్డారు. 

 

హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో ఎంఐఎం, ఆ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలుస్తాయని మాజీ ఎంపీ లగడపా టి రాజగోపాల్ తన సర్వేలో వెల్లడించారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందన్నారు. వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యత లభిస్తుందని, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందన్నారు.  

అయితే, గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగితే అంచనాలు తారుమారు కావచ్చన్న విషయాన్ని గమనించాలని కోరారు. ప్రస్తుతం ప్రజానాడి కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని, విభజన తర్వాత ప్రజల మధ్య ఎలాంటి రాగద్వేషాలు లేవని అన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని, ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1200 నమూనాలు తీసుకున్నామని, అన్ని సామాజిక వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు.

10 మంది స్వతంత్ర అభ్యర్దులు గెలుస్తారని చెప్పిన లగడపాటి అందులో ఇప్పటి వరకు ఐదుగురి పేర్లు చెప్పారు. వారి వివరాలివే

 

ఇబ్రహింపట్నం లో ఇండిపెండెంట్ (కాంగ్రెస్ నేత) మల్ రెడ్డి రంగారెడ్డి

 బెల్లం పల్లిలో టిఆర్ఎస్ రెబెల్ గా పోటీ చేసిన జి వినోద్ (వివేక్ సోదరుడు, టిఆర్ఎస్ రెబెల్)

 మక్తల్ లో ఇండిపెడెంట్ గా పోటీ చేసిన జలంధర్ రెడ్డి

పాలమూరు జిల్లాలోని నారాయణపేటలో శివకుమార్ రెడ్డి  

ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గం నుంచి అనీల్ కుమార్ జాదవ్ గెలుస్తాడని లగడపాటి ప్రకటించారు.  

లగడపాటి సర్వే పై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ చంద్రబాబు ఒత్తిడితో పిచ్చి సర్వేలు ప్రకటిస్తున్నారని వారు విమర్శించారు. లగడపాటి సర్వేలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు ఎవరిని ఎన్నుకోవాలో తెలుసని హారీష్ రావు అన్నారు. గెలవ చేతకాక సర్వేలతో మాయ చే్ద్దామని చూస్తున్నారని హారీష్ రావు విమర్శించారు.