తెలంగాణ నిరుద్యోగ అభ్యర్ధులకు ఊరట

తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అప్లికేషన్ ప్రాసెస్ లో ఇబ్బందులతో  వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం రెండు రోజుల గడువును పెంచింది. మంగళవారంతో ముగియనున్న ఫీజు గడువును మరో రెండు రోజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు గడువును 13 వతేది వరకు, అప్లికేషన్ గడువును 14 వ తేది వరకు పొడిగించారు.

అపద్దర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో అప్లికేసన్ల గడువును పొడిగిస్తూ నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియకు సంబంధించిన అప్లికేషన్లలో ఆది నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫీజు చెల్లింపులో ఇబ్బందులు మరియు సర్వర్ బిజితో నిరుద్యోగులు, అభ్యర్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులే కాకుండా మరో వారం రోజులు పొడిగిస్తే బాగుండేదని నిరుద్యోగ అభ్యర్ధులు అంటున్నారు. చాలా మంది అప్లై చేసుకోలేదని అలాగే ఫీజు కూడా ఎక్కువగా ఉండటం మరియు మీ సేవా, ఇంటర్నెట్ సెంటర్ వారు అప్లికేషన్లకు ఎక్కువ పైసలు తీసుకుంటుండడంతో చాలా మంది అప్లై చేసుకోలేదని వారం రోజుల పాటు గడువు పొడిగించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

సెప్టెంబర్ 3 తేదిన ప్రారంభమైన అప్లికేషన్ల ప్రాసెస్ మంగళవారంతో ముగియనుంది. కానీ అనేక మంది నిరుద్యోగుల వినతితో ప్రభుత్వం స్పందించింది. అప్లికేషన్లు ప్రారంభమైనప్పుడు ఫీజు పే అయినట్టు డబ్బులు కట్ అయ్యాయి కానీ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ముందుకు సాగలేదు. అలా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మంది పైసలు కట్ అయి మళ్లీ రిఫండ్ కాలేదు. ఆ తర్వాత గత నాలుగు రోజుల నుంచి సర్వర్ బిజీ మరియు సర్వర్ ఎర్రర్ వచ్చి ఇబ్బందులు  అయ్యాయి. ఒక్క అప్లికేషన్ కు రెండు గంటల సమయం పట్టింది. ప్రభుత్వం మరో వారం గడువు పెంచితే అందరికి ఉపయోగకరంగా ఉండేదని పలువురు అంటున్నారు. ఈ నెల 28న పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ఉంది. రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహించనున్నారు.