తెలంగాణ పంచాయతీ కార్యదర్శి అభ్యర్దులకు కేసీఆర్ గుడ్ న్యూస్

తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల నియామకానికి పరీక్ష ముగిసిన ఫలితాలు రాలేదు. పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన ప్రక్రియకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 9355 గ్రామ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన ఫైల్ పై కేసీఆర్ సంతకం చేశారు. ఫలితాలు ప్రకటించి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. 

గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తర్వాత దేశం బాగుపడుతుందని కేసీఆర్ గతంలో వ్యాఖ్యానించారు. గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉంటే అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించవచ్చనే ఉద్దేశ్యంతో టిఎస్పీఎస్సీతో సంబంధం లేకుండా డిపార్ట్ మెంటల్ పరీక్ష నిర్వహించారు. నెల రోజుల వ్యవధిలోనే పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించారు. రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహించారు.  

జెఎన్టీయూ పరీక్ష నిర్వహించింది. పలితాలను కూడా పంచాయతీరాజ్ శాఖ వారికి అప్పగించారు. కానీ ఎన్నికల కోడ్ , ఎన్నికలు జరగడంతో అధికారులంతా అటు బిజిగా ఉన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నియామకాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే ఫలితాల వెల్లడి ఆలస్యం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ తన పాలనలో స్పీడ్ పెంచారు. పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నియామకాలకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు.  

పంచాయతీ రాజ్ అధికారులు వారం రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే మెరిట్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు చేస్తారు. నూతనం గా నియమితులైన వారికి జనవరి 10 వ తేది అపాయిట్ మెంట్ లెటర్ ఇస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  జిల్లా కలెక్టర్లు ఈ ప్రాసెస్ అంతా నిర్వహిస్తారు. జిల్లాలో వచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగా నియమిస్తారు. తెలంగాణలో జనవరి 10 లోపు మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కొత్త  సర్పంచ్ లు వచ్చే లోపు కొత్త పంచాయతీ కార్యదర్శులు ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.   

  కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలన్నారు.  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తికాగానే గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించాలన్నారు.  కొత్త కార్యదర్శుల నియామకం ద్వారా ప్రతి గ్రామానికి కూడా కార్యదర్శి ఉంటారని దీంతో గ్రామాభివృద్ది తొందరగా జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రతి పల్లె కూడా అభివృద్దితో ముందుండాలని, అందుకు తగ్గ ప్రణాళికలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.