ఆంధ్రా ప్రజలకు కేంద్ర సర్కారు తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర విభజన జరిగినా హైకోర్టు విభజన జరగకుండా చిక్కుముళ్లు పడ్డ నేపథ్యంలో హైకోర్టు విభజనకు కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. హైకోర్టు విభజన పై రాష్ట్రపతి ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. ఏప్రిల్ 7 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనుగడలోకి రానుంది. ఈ మేరకు రాష్ట్రపతి నోటిఫై చేశారు. ఏప్రిల్ 7వ తేదీ ఉగాది కూడా కావడంతో అదేరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆరంభం కావడం శుభసూచకంగా చెబుతున్నారు.

అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణం తుది దశకు చేరుకున్నది. నిజానికి ఇక్కడ జనవరిలోనే హైకోర్టు సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రకరకాల కారణాల రిత్యా ఆలస్యమైంది. సంక్రాంతికి ప్రారంభం కావాల్సి ఉన్నా ఆలస్యం కారణంగా ఉగాది నాటికి వాయిదా పడింది. వేసవి సెలవుల్లో అంటే ఏప్రిల్ 7వ తేదీన ఎపి హైకోర్టు అపాయింటెడ్ డే గా రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొద్ది రోజుల కిందటే న్యాయమూర్తుల విభజనతోపాటు సిబ్బంది విభజన కూడా పూర్తయింది. ఏపిలో హైకోర్టు నిర్మాణం పూర్తయితే హైకోర్టును ఎపికి తరలించేందుకు తమకు అభ్యంతరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో ఎపి సర్కారు కూడా అమరావతిలోని నేలపాడు గ్రామంలో హైకోర్టు నిర్మాణం చేపట్టామని వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని తేల్చి చెప్పింది.

ఈ నిర్మాణాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు న్యాయమూర్తులంతా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వీరు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. డిసెంబరు చివరి నాటికే హైకోర్టు నిర్మాణం పూర్తి కానుందని, సంక్రాంతి సెలవుల అనంతరం తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

ఇక అధికారికంగా మాత్రం ఏపి హైకోర్టు 2019 ఏప్రిల్ 7వ తేదీ నుంచి పనిచేయడం ప్రారంభం అవుతుంది. ఉగాది కూడా అదే రోజు ఉండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణకూ తీపి కబురే 

హైకోర్టు విభజన అంశం ఆంధ్రా ప్రజలకు ఎంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువగా తెలంగాణకు ఉంది. హైకోర్టు విభజన కానీయకుండా ఎపి సిఎం చంద్రబాబు, కేంద్రంలోని మోదీ సర్కార్లు అడ్డుపడుతున్నాయని టిఆర్ఎస్ నేతలు పదే పదే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. హైకోర్టు విభజన జరగనీయకుండా చంద్రబాబు అడ్డు పడుతున్నాడని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ కోరినట్లుగా మరో నాలుగు నెలల్లో ఎపి హైకోర్టు ఇక్కడి నుంచి తరలిపోనుంది.  ఈ అంశం టిఆర్ఎస్ కు ఆనందం కలిగించే అంశమే అని తెలంగాణకు చెందిన హైకోర్టు న్యాయవాది ఒకరు తెలిపారు.