ప్రజా యుద్ధ నౌక గద్దర్ కొత్త దారి ఇదేనా ?

ప్రజా యుద్ధ నౌక.. గద్దర్ పేరు విన్నా.. పలికినా.. నరాలు ఉప్పొంగుతాయి, రోమాలు నిక్కపొడుస్తాయి.. ఇదంతా నిన్నటివరకు. మరి నేడు? సమ సమాజ స్థాపన కోసం ఆయుధాలు పట్టిన చేతులు గద్దర్ వి. కానీ ఇప్పుడు ఆయన రూట్ మార్చిర్రా? కొత్త రూట్ లకు ఎందుకు మళ్లిర్రు. కొత్త రూట్ లోనూ పాత దూకుడు చూపిస్తున్నరా? ఇంతకూ యుద్ధ నౌక గద్దరన్న దారేది? చదవండి స్టోరీ.

తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలన్న లక్ష్యంతో గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ తన జీవితంలో సింహభాగం పనిచేశారు. తుపాకీ తూటల్లాంటి మాటలతో, ప్రవాహం లాంటి పాటలతో యూత్ ను ఉద్యమబాట పట్టించారు. వందలు, వేల మంది గద్దర్ పాటలకు, మాటలకు ఆకర్షితులై విప్లవ ఉద్యమంలో కలిసిపోయారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఉద్యమానికి విరమణ చెప్పారు. ఇంకొందరు ఇంకా మూమెంట్ లోనే పనిచేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గదరన్న వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చినట్లు కనబడుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాతే ఆయన రాజకీయ పార్టీ స్థాపించాలని ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు. విప్లవ రాజకీయాలకు విరమణ చెప్పింది కూడా తెలంగాణ సాధన తర్వాతే. నిజానికి తెలంగాణ ఉద్యమానికి మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో గద్దర్ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయ పోరాటాలకు గద్దర్ ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటాలు నడిపి ఉద్యమ వేడి చల్లారకుండా చేశారు. అంతిమంగా తెలంగాణ వచ్చేసింది.

రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా గత మూడేళ్ల కాలంలో గద్దర్ కొద్దిగా ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యం కాలేదు. ప్రస్తుతం సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలతో కూడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తో కలిసి గద్దర్ పనిచేస్తున్నారు. ఆదివారం సీతారాం ఏచూరి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పెద్ద ర్యాలీ జరిపింది. శంషాబాద్ నుంచి బాగ్ లింగంపల్లి వరకు ఈ ర్యాలీ జరిగింది. అనంతరం జరిగిన సభలో గద్దర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను చూస్తుంటే బహుజనుల రాజ్యం రాబోతుందన్న సంతోషం కలుగుతుందన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే తనకూ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనిపిస్తోందని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు తనకు ఓటు హక్కు కూడా లేదన్నారు. కానీ ఇప్పుడు ఓటుకు దరఖాస్తు చేసుకుంటానని చెప్పారు. అయితే గద్దర్ కామెంట్స్ పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అదే సభలో స్పందించారు. గద్దర్ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించడమే కాదు పోటీ చేయించి గెలిపించి చట్టసభకు పంపుతామని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తానికి గద్దర్ ఎప్పుడైతే విప్లవ రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారో అప్పటి నుంచి ఇటువైపు కూడా వడివడిగానే అడుగులు వేస్తున్నారు. ఓట్లు, సీట్లు, అధికారం దిశగా గద్దర్ ప్రయాణం సాగుతున్నది. రానున్న ఎన్నికల్లో గద్దర్ పోటీ చేయడం ఖాయంగా కనబడుతున్నది. ఆయన ఎంపికి పోటీ చేస్తారా? అసెంబ్లీకి పోటీ చేస్తారా అన్నది ఇంకా తేలకపోయినా పోటీ మాత్రం తప్పేలా లేదు. అయితే గద్దర్ పోటీ చేస్తే.. బిఎల్ఎఫ్ నుంచే పోటీ చేస్తారా? వేరే వేదికలను ఎంచుకుంటారా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. గద్దర్ పోటీ చేయాలనుకుంటే ఆయనకు స్వాగతం పలికేందుకు అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు కోదండరాం జన సమితి కానీ సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు. ఒకవేళ గద్దర్ బిఎల్ఎఫ్ నే ఎంచుకుంటే ఇక్కడినుంచే పోటీ చేయవచ్చు. లేదంటే కాంగ్రెస్, తెలంగాణ జన సమితిలలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చని చెబుతున్నారు.

విప్లవ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన గద్దర్ మరి ఆ రాజకీయాలను వదిలేసి ప్రజాస్వామ్య పంథాలోకి అడుగు పెట్టారు. మరి ఇక్కడ కూడా అదే రీతిలో సక్సెస్ అవుతారా లేదా అన్నది మరో ఏడాదిలోనే తేలిపోనుంది. అయితే ఇప్పటికే తన కొడుకు సూర్య కిరణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇటీవల సూర్య కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలు చూసినా గద్దర్ కూడా క్రియాశీల రాజకీయాలను నడపడం ఖాయమైపోయిందని ఆయన అభిమానులు అంటున్నారు. విప్లవ రాజకీయాలను వదిలి ప్రజాస్వామ్య పంథాలో గద్దరన్న రాజకీయాలు నడపడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా స్వాగతిస్తున్నారు.