హైదరాబాదీలకు శుభవార్త… వచ్చే ఏడాది నుండి ఉచిత తాగునీరు !

Minister KTR

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నగరంలోని ప్రతి ఇంటికీ నూతన సంవత్సరం తొలివారంలో ఉచిత తాగునీరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉచిత తాగునీరు పంపిణీపై మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌, జలమండలి ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నూతన సంవత్సర తొలివారంలో హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగునీరు ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల తాగునీటి వినియోగం 20 వేల లీటర్ల వరకు ఉచితం.

ఈ మేరకు జనవరి నెలలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20 వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలను సిద్ధం చేయాలని కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వచ్చే వేసవికి సైతం సరిపోయే విధంగా నీటి సరఫరా చేసేందుకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.