టీఆర్ ఎస్ కు దీటుగా… మొత్తానికి ప్రజాకూటమి నిజమైంది

(మల్యాల పళ్లంరాజు)

ప్రజాస్వామ్యంలో ఏదీ అసాధ్యం కాదని మరో సారి రుజువైంది. తెలంగాణలో ఎదురులేని నాయకుడుగా పేరొందిన కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రజాకూటమి .. అదే మహా కూటమి ఎట్టకేలకు రూపుదాల్చింది. నాలుగున్నర ఏళ్ల పాలనలో ఎన్నో చేశామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల్లో మన్ననలు కన్నా.. వ్యతిరేకతే హెచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత ను క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ,టిజేఎస్ కూటమి చకచకా పావులు కదుపుతోంది.

2014లో కె. చంద్రశేఖరరావు తెలంగాణలో తిరుగులేని నాయకుడు. ఈ నాలుగున్నర ఏళ్లుగా తన మాటే వేదవాక్కుగా.. తాను చేసిన ప్రతి పనీ శాసనంగా.. తనకు తిరుగులేదన్నట్లే ప్రభుత్వాన్ని నడిపించారు. సెక్రటేరియట్ ను పట్టించు కోకుండా, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ నుంచే పాలన సాగించినా.. సాగింది. పూర్తి మెజారిటీ ఉన్నా.. తనకు ఎదురు లేకపోయినా ఆరు నెలలు ముందే అసెంబ్లీని రద్దు చేయాలని ఏకపక్షంగా నిర్ణయించారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో కూడా ప్రజలకు వివరించే యత్నం చేయలేదు. ఆ నియంతృత్వ ధోరణులే ఆ పార్టీకి ముప్పు తెచ్చేలా పరిణమిస్తున్నాయి. ఇక నాలుగేళ్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప, మిగతా మంత్రులంతా డమ్మీలుగానే మిగిలి పోయారు. నలుగురు కుటుంబసభ్యుల పాలనకు, పెద్దఎత్తున సాగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, టిజెఎస్ నిరసన గళం ఎత్తినా.. ఆ నిరసనలను సర్కార్ పట్టించుకోలేదు. ధర్నా చౌక్ నే ఎత్తివేసి, నిరసనకారుల నోళ్లకు సీళ్లు వేసింది. ఈ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా పుట్టిన ఆలోచనే ప్రతిపక్షాల ఐక్యత.

కేసీఆర్ కు వ్యతిరేకంగా, ఆ పార్టీకు చెక్ పెట్టగలిగే ప్రతిపక్షాల కూటమి ఏర్పడుతుందని తెలంగాణ ప్రజలు అసలు ఊహించలేదు. అయితే సర్కార్ నియంతృత్వ ధోరణులకు కళ్లెం పడాలని మాత్రం ఆశించారు. నాలుగేళ్లుగా తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన పార్టీ మాదే. ప్రజలు మాకే ఓటు వేసి తీరతారని భ్రమల్లో ఉన్న కాంగ్రెస్ కాస్త ఆలస్యంగానైనా వాస్తవాలను గుర్తించింది. ప్రతిపక్షాలను ఏకం చేసి,ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా ఒడిసి పట్టని పక్షంలో ఇప్పటికీ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకోవడం అసాధ్యమనే సత్యాన్ని గుర్తించి ఆ దిశగా అడుగులు వేసింది. విభిన్న సిద్ధాంతాలు, వేర్వేరు ధోరణులు గల ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడం అసాధ్యమే. ఆదిలోనే, బీజేపీ, సిపీఎం వంటి పార్టీలు కాంగ్రెస్ ను దూరం పెట్టాయి. ఇక 35 ఏళ్లుగా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం, టీఆర్ఎస్ మొదటి నుంచి దూరం పెట్టిన ఉద్యమ నాయకుడు కోదండరాం, మరో ఎర్రపార్టీ సీపిఐలను ఏకతాటిపై తెచ్చే మహత్తర కార్యాన్ని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ కుమార్ రెడ్డి చేపట్టారు.
భారత సైనిక దళాల్లో చాలా కాలం పనిచేసి, పలు యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొన్ని ఉత్తమ కుమార్ రెడ్డికి, కెప్టెన్ గా తన బెటాలియన్ ను ఏ విధంగా సమగ్రంగా ఉంచాలో, నియంత్రించాలో, కీలక సమయాల్లో చేతిలో ఉన్న అతి తక్కువ వనరులను సర్ది, జట్టును క్రమశిక్షణతో ముందుకు నడపాలో అనుభవ పూర్వకంగా తెలుసు. ఆ అనుభవం, కార్యదక్షత ఇప్పుడు కలిసి వచ్చింది.

కేసీఆర్ ను తిరిగి అధికారంలోకి రాకుండా నిలువరించడమే ఏకైక లక్ష్యంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసే నిమిత్తం, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక కూటమికి డైరెక్ట్ ఫైట్ ఉండేలా చూసేందుకే ఎత్తులు వేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మహానేత సోనియాగాంధీ ఇతర పెద్దల ఆశీస్సులు, తెలంగాణలో కేడర్ ఉన్నా…దాదాపు బోర్డు తిప్పేసే స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు, కోదండరాం సర్దుకు పోయే తత్వం పీసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డికి కలిసి వచ్చాయి. జానారెడ్డి, గీతా రెడ్డి, డికె అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వెంకటరెడ్డి సోదరులు వంటి సీనియర్ నాయకులు సహకరించడంతో నాలుగు పార్టీల ప్రజా కూటమి ఓ కొలిక్కి వచ్చింది.

 

కేసీఅర్ ను గద్దె దింపడంపై ఏకాభిప్రాయానికి వచ్చినా కాంగ్రెస్ తో సహా ప్రజా కూటమిలో ని పార్టీలకు సీట్ల సర్దుబాటు ఓ పెద్ద సమస్యగా మారింది. కాంగ్రెస్ పెద్దన్న ధోరణిలో 95 సీట్లు మావే.. మిగతావి మీవి అనడంతో చిక్కులు ఎదురయ్యాయి. టీడీపీకి 14 సీట్లే ఇచ్చినా చంద్ర బాబు మాటను టీ టిడీపీ నాయకులు జవదాటలేదు కానీ, టీజేఎస్, సిపిఐ తమకు మరిన్ని సీట్లకోసం పేచీ పెట్టడంతో ఒక దళలో ప్రతిపక్షాల కూటమి ఏర్పడుతుందా అన్న సందేహం కలిగింది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి వాదులు, ఆశావహులకు కొరత లేదు. అధికార టీఆర్ ఎస్ కు కూడా అమ్మతి సెగలు తప్పలేదు. ఒకప్పుడు మొత్తం అన్ని స్థానాలకు పోటీచేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో ఆశావహుల సంఖ్య ఎక్కువే. పొత్తు నేపధ్యంలో కొన్ని స్థానాలను వదులుకోవల్సి వస్తే, ఆ స్థానాలను ఆశించి భంగపడిన వారు ఆగ్రహా వేశాలకు లోను కావడం, ధర్నాలు, ర్యాలీలు చేయడం, తిరుగు బాటు చేయడం సహజమే. ప్రస్తుతం ఓ కూటమిగా ఏర్పడిన పార్టీలన్నీ కూడా అలాంటి ఆటుపోట్లే ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు, వెన్నుపోటు పొడిచే నాయకుల బెడద ఆయా పార్టీలకు తప్పక పోవచ్చు. ఏమైనా, టీఆర్ ఎస్ ఒంటెద్దు పోకడలకు దీటుగా ఎదిరించే సమైక్య కూటమి రూపు దాల్చింది. ఇది కెసియార్ గాని, తెలంగాణ రాజకీయ పండితులు గాని వూహించని పరిణామం.  టిడిపి అవసరమయితే టిఆర్ ఎస్ తో కలుస్తుందనుకుంటున్నపుడు కాంగ్రెస్ తో కలవడమే వింత. ఇక మేని ఫెస్టోలు, ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమం తరువాయి. వీలైనంతవరకూ తమ రెబెల్ అభ్యర్థులు రంగంలో లేకుండా చూసుకోవల్సిన కీలక కర్తవ్యం ఆయా పార్టీలపై ఉంది. అసమ్మతి కూటమిలో ఎలా ఉందో టిఆర్ ఎస్ లో కూడా ఉంది. చాలా చోట్ల టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన వాళ్లంతా ధర్నాలు చేశారు. అలా నిరుత్సాహ పడిన వాళ్లలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా ఉన్నారు. వాళ్లందరిని ఇంకా దారికి తెచ్చుకోలేక టిఆర్ఎస్ సతమతమవుతూనే ఉంది. కాబట్టి అసమ్మతి లేని పార్టీ అంటూ లేదు.

 

మొత్తానికి ప్రతిపక్షాల ఉమ్మడి వేదిక ఏర్పడింది. ఈ కూటమి ని వ్యతిరేకించే మరి కొన్ని పార్టీలు కూడా ఎన్నికల గోదాలో దిగడం వల్ల బహుముఖ పోటీలు తప్పక పోయినా, డిసెంబర్ 7న తెలంగాణలో జరిగే ఎన్నికలు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి, టీఆర్ ఎస్ కు డైరెక్ట్ ఫైట్ అని చెప్పక తప్పదు. ప్రజా కూటమి దాదాపు రూపు దాల్చక ముందే… ఢిల్లీ లోని సిఓటర్ అనే సర్వే సంస్థ తమ ముందస్తు సర్వే లో మహా కూటమికే తెలంగాణలో విజయావకాశాలు ఉన్నాయని చెప్పడం మరో కాంగ్రెస్ టిడిపి వర్గాల్లో ఉత్సాహం నింపింది. సర్వేలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా.. కూటమిలోని పార్టీల ఓట్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి బదిలీ అవుతాయా. మొన్నటి వరకూ పరస్పరం వ్యతిరేకించుకున్నపార్టీలు క్షేత్ర స్థాయిలో సహకరించుకుంటాయా. ఉమ్మడి అజెండా అమలు సాధ్యమా.. కూటమిని తెలంగాణ ప్రజలు ఏమేరకు ఆహ్వానిస్తారు అన్న పలు సందేహాలు ఉండడం సహజం అయినా ప్రతిపక్షాల ప్రజా కూటమి కెసిఆర్ కు మాత్రం రానున్న ఎన్నికల్లో దీటైన పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం.

(మల్యాల పళ్లం రాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్, వ్యాసం లోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)