హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ కు కొత్త సవాల్ !

Field Assistants association warns TRS government

తెలంగాణా: టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకొచ్చేసిన ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. దాంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇంకా అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. రసవత్తరంగా మారిన ఈ పోటీలో అధికార పార్టీ నుండి ఎవరు నిలబడతారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Field Assistants association warns TRS government

టీఆర్ఎస్ నాయత్వం ఈటెలను ఢీ కొట్టే మొనగాడు కోసం వెతుకులాటలో తలమునకలైంది. కానీ ఈ తరుణంలో అధికార పార్టీకి పెద్ద చిక్కొచ్చిపడింది. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించింది. అయితే ఇటీవలే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ నిరసన తెలిపారు. అంతేకాకుండా వారందరూ హుజురాబాద్ ఉప ఎన్నికకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక లోపు దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఏకంగా ఉప ఎన్నికల్లో తమ సంఘం నుంచి వెయ్యి మంది పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టిఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు. దీంతో కెసిఆర్ అండ్ కో భయపడిపోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదేమాదిరి పరిస్థితి ఎదురై చావుదెబ్బ తగిలింది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల టైంలో పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ను నెరవేర్చలేదన్న కారణంతో భారీగా పసుపు రైతులందరూ కేసీఆర్ కూతురు ‘కవిత’కు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయడం అప్పట్లో సంచలనమైంది. చివరికి ఆ ఎన్నికల్లో కవిత ఓడిపోయి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించాడు. ఇక ఇప్పుడు కూడా అలానే జరుగుతుందేమోనని టీఆర్ఎస్ వర్గాల్లో గుబులుగా ఉందట.