మంత్రి వర్గంలో స్థానం పై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు తమ పై నమ్మకం పెట్టుకొని ఘన విజయం అందించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వారి నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బుధవారం కరీంనగర్ లో ఆయన మాట్లాడారు. మంత్రి వర్గంలో స్థానం పై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..

“తెలంగాణ ప్రజలందరికి సేవ చేసే భాగ్యం దొరికింది. తమ కుటుంబ సభ్యుల్లా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. మా మీద నమ్మకం పెట్టుకొని అధికారం ఇచ్చిన ప్రజలకు ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం చేయం. తెలంగాణలో దాదాపు సమస్యలన్నీ పరిష్కరించగలిగాం. తెలంగాణలో వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించాం. 

త్వరలో మంత్రి వర్గ కూర్పు ఉంటుందని భావిస్తున్నాను. సీఎం కేసీఆర్ అభిష్టం మేరకే కూర్పు ఉంటుంది. నాకు మంత్రి పదవి దక్కే విషయం పై చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కు నాకు ఏ బాద్యతలు అప్పగించాలో తెలుసు. ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తాను. నా విషయంలో అందరికి ఆమోద యోగ్యమైన నిర్ణయం వస్తుందన్న నమ్మకం ఉంది.

త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కష్టపడ్డ వారికి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితం ఉంటుంది. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని మాత్రం వదిలేదు. వారు ఏ స్థాయిలో ఉన్నా వారిని వదిలి పెట్టం.” అని ఈటెల రాజేందర్ అన్నారు. 

గత కొద్ది రోజులుగా ఈటల రాజేందర్ కు స్పీకర్ పదవి వస్తుందని జోరుగా చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవి తీసుకోవడానికి ఈటల రాజేందర్ ఇష్టంగా లేరని ప్రచారం జరిగింది. స్పీకర్ పదవి చేపట్టిన వారెవరైనా మళ్లీ గెలవడం కష్టమేనన్న నమ్మకం ఉంది. దీంతో ఈటల రాజేందర్ స్పీకర్ పదవిని తిరస్కరించారని తెలిసింది. ఈటల రాజేందర్ మాట్లాడిన తీరును చూస్తే మంత్రి వర్గంలో బెర్తు ఖాయమేనని తెలుస్తోందని టిఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.