టిఆర్ఎస్ మంత్రి ఈటలపై పోటీ చేస్తా : కార్ డ్రైవర్ మల్లేష్

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పై కారు డ్రైవర్ మేకల మల్లేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మల్లేష్ యాదవ్ శుక్రవారం మాట్లాడారు. మల్లేష్ గతంలో ఈటల వద్ద కార్ డ్రైవర్ గా పని చేశారు. ఇప్పుడు ఈటల గురించి పాత విషయాలను గుట్టు రట్టు చేసాడు. ఈటల రాజేందర్ పెద్ద మోసగాడని ఆరోపించారు. ఈటల వద్ద పని చేసే కాలంలో తనను అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. ఈటల రాజేందర్ మాజీ కారు డ్రైవర్ అసలు అలా ఎందుకన్నారు? పిడుగు లేని ఉరుము లా ఎందుకు తెర మీదకు వచ్చాడు. ఎన్నికల ముందు మల్లేష్ ఎందుకు నోరు విప్పాడు. పూర్తి వివరాలు చదవండి.

తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో లోక్ సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ పై దాడి జరిగింది. ఈటల కార్ డ్రైవర్ మల్లేష్ దాడి చేశాడు. ఆ సమయంలో స్పీకర్ నాదేండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే మీద దాడి చేసిన మల్లేష్ ను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే డ్రైవర్ మల్లేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. నెలకు పైగా రిమాండ్ లో ఉన్నాడు మల్లేష్.

ఆ దాడి ఘటన గురించి మల్లేష్ యాదవ్ వివరణ ఇచ్చారు. అప్పుడు జయ ప్రకాష్ నారాయణ మీద దాడి చేసేలా తనను ఉసిగొల్పారన్నారు. ఏ ప్రమేయం లేకుండానే అతని పై దాడి చేసేలా ప్రోత్సహించారన్నారు. జయప్రకాష్ నారాయణ పై దాడి కేసులో తాను 35 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించానన్నారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈటల వద్దకు వెళితే తనను కారు డ్రైవర్ గా చేర్చుకోలేదన్నారు.

తనకు అనేక మంది సన్మానాలు సత్కారాలు చేశారని, దాతల నుంచి కూడా 30 లక్షల రూపాయలు వచ్చాయన్నారు. వాటన్నింటిని కూడా ఈటల రాజేందర్ తీసుకున్నారని మల్లేష్ యాదవ్ ఆరోపించారు.

ఏ పని లేకపోవడంతో తమ స్వగ్రామం మరిపెడ మండలం చిల్లంచెర్లకు వెళ్లి పోయి వ్యవసాయ పని చేసుకుంటూ బతుకుతున్నానన్నారు. ఇన్నాళ్ల వరకు కూడా ఈటల న్యాయం చేస్తారని ఎదురు చూశానన్నారు. కానీ తనను పట్టించుకోకుండా తనకు ఈ దుస్థితికి తెచ్చిన ఈటల పై స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేస్తానని ప్రకటించారు. తాను వరంగల్ జిల్లాకు చెందిన వాడినైనా సరే హూజురాబాద్ అసెంబ్లీ నుంచి పోటి చేస్తానని మల్లేష్ యాదవ్ ప్రకటించారు.

 

గెలుపోటములు తర్వాతనని కానీ ఈటల రాజేందర్ అసలు స్వరూపం ప్రజలకు తెలియజేస్తానన్నారు. ఈటల రాజేందర్ అనగానే అందరికి మంచి వాడనే గుర్తింపు ఉందని అదంతా పైకి కనబడేదే అని లోపల మాత్రం చాలా జరుగుతుందన్నారు. ఈటల రాజేందర్ ను తాను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నానని అందరూ అనుకున్నంత మంచి వాడు ఈటల రాజేందర్ కాదన్నారు.

స్వంత నియోజక వర్గాన్ని అభివృద్ది చేయలేని వాడన్నారు. ఆయన అన్నింటిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. కార్యకర్తలను దూరం పెట్టారని, వేరొకరి ఎదుగుదలను ఈటెల రాజేందర్ ఓర్చుకోలేడని మల్లేష్ ఆరోపించారు.

తనకు వచ్చిన 30 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగితే అవి నావల్లనే నీకు వచ్చాయని నీకెలా ఇస్తానని ప్రశ్నించారన్నారు. అనేక సార్లు వెళ్లి ఎంతో కొంత ఇవ్వాలని తమ కుటుంబ పోషణకు ఇబ్బంది అవుతుందన్నా కూడా ఈటల పట్టించుకోలేదని మల్లేష్ యాదవ్ ఆరోపించారు. ఈటల పై పోటి చేసి అతని గురించి నియోజకవర్గమంతా చెబుతానన్నారు.ఈటెల పై స్వంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉందన్నారు. మల్లేష్ యాదవ్ ఆరోపణలతో ప్రస్తుతం హూజురాబాద్ లో చర్చ జరుగుతోంది.