కాంగ్రెస్ అభ్యర్థుల పై వార్ రూమ్ కసరత్తు, ఆ 12 సీట్లపై తెగని ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిరంతరాయంగా కొనసాగుతోంది. మంగళవారం కాంగ్రెస్ వార్ రూమ్ లో 14 గంటలపాటు కసరత్తు చేసారు కాంగ్రెస్ నేతలు. బుధవారం కూడా మిత్ర పక్షాలకు కేటాయించాల్సిన స్థానాలు, పార్టీ తరపున ఖరారు చేయాల్సిన అభ్యర్థుల జాబితా, సామజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యంపై చర్చిస్తున్నారు. మొదటి విడతలో 54 మంది అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. మిగతా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను రేపు ఖరారు చేయనుంది.

మొత్తంగా ఈసారి ఎన్నికల్లో 8 మంది మాజీ ఎంపీలు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం 4 గంటలకు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై తుది జాబితాకు ఆమోదముద్ర వేయనుంది. శుక్రవారం ప్రజాకూటమి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్నారు.

మంగళవారం అర్ధరాత్రి వరకు వార్ రూమ్ లో కొనసాగిన సమాలోచనలలో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికంటే ఎక్కువమంది అభ్యర్ధులని ఎంపిక చేయడం జరిగింది. వారందరిని బుధవారం సమావేశానికి పిలిపించి మంతనాలు, బుజ్జగింపులు జరిపిన అనంతరం గెలుపు గుర్రాలు ఎవరని భావిస్తున్నారో వారిని ఎంపిక చేసేందుకు చర్చలు నడిచాయి.

ఈమేరకు దేవరకొండకు చెందిన ముగ్గురు నాయకులు జగన్ లాల్, బిల్యా నాయక్, బాలు నాయక్ లతో కొద్దిసేపటి క్రితం వార్ రూమ్ లో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారికున్న బలాబలాలను, శక్తి సామర్ధ్యాలపై సదరు అభ్యర్థుల సమక్షంలోనే చర్చలు జరిపి ఎవరికి సిటు వచ్చినా అందరూ కలిసి పని చేయాలని వారి నుండి కమిట్ మెంట్ తీసుకుంటున్నారు. అలాగే పలు నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ మంది రేస్ లో ఉంటే ఇదే ప్రక్రియ చేపడుతున్నారు.

ఎల్లారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, మంచిర్యాల, సూర్యాపేట, ఇల్లందు, దేవరకొండ, ధర్మపురి, మెదక్, పెద్దపల్లి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కూడా ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసారు. ఇప్పుడు ఆ అభ్యర్థులతో కూడా స్క్రీనింగ్ కమిటీ చర్చలు నిర్వహిస్తోంది. చర్చల అనంతరం నియోజకవర్గానికి ఒకే అభ్యర్థిని ఫైనల్ చేసి గురువారం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి కసరత్తులో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్క అభ్యర్థినే సూచించాలి. అందరూ దీని కోసం సమిష్టిగా సమాలోచనలు చేసి ఎవరైతే ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా నిలుస్తారో వారిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ప్రతిపాదించాలి అని రాహుల్ నేతలకు సూచించారు.

రెబెల్స్ అనేవారు ఉండకుండా పక్కా గా వార్ రూమ్ కసరత్తు కొనసాగుతున్నది. మరి అంతర్గత ప్రజాస్వామ్యం దండిగా ఉన్న కాంగ్రెసులో ఈ కసరత్తు ఏ మేరకు పని చేస్తుందో చూడాలి.