బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ జగ్గారెడ్డి అరెస్ట్

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.సోమవారం రాత్రి జగ్గారెడ్డిని హైద్రాబాద్ నార్త్ జోన్ పోలీసులు పటాన్ చేరు సమీపంలో అరెస్ట్ చేశారు. 2014లో జగ్గారెడ్డి, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నకిలీ పాస్ పోర్ట్, నకిలీ వీసా ద్వారా అమెరికా వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.ఈ మేరకు పటాన్ చెరు వద్ద జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు.

అంతేకాకుండా భార్య, పిల్లల పెరు మీద గుజరాత్ కు చెందిన ముగ్గురు మహిళలను జగ్గారెడ్డి అమెరికాకు అక్రమ రవాణా చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 2014లో జగ్గారెడ్డి ఫామిలీ నెల రోజుల పాటు అమెరికాలో గడిపి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డిని నార్త్ జోన్ పోలీసులు విచారిస్తున్నారు. 

ముందస్తు ఎన్నికల వేళ జగ్గారెడ్డి అరెస్ట్ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపే ఛాన్స్ ఉంది. త్వరలో ఏఐసీసీ నేత గులాం నబీ ఆజాద్ తో భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేసే యోచనలో జగ్గారెడ్డి ఉన్నారు. దీనిపై పీసీసీ కసరత్తు చేస్తున్నది. అకస్మాత్తుగా జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

ఉమ్మడి రాష్ట్రంలో జగ్గారెడ్డి కరుడుగట్టిన సమైక్యవాది గా ముద్ర పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరి మనిషిగా పేరు పొందారు. కేసీఆర్ పట్ల జగ్గారెడ్డి తీవ్ర వ్యతిరేక భావనతో ఉన్నారు. ఇదిలా ఉండగా జగ్గారెడ్డి అరెస్ట్ ను పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హైద్రాబాద్ సిపి అంజన్ కుమార్ కేసీఆర్ కు తొత్తుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు మీద పోరాటం చేస్తున్నందుకు కుట్రతో అరెస్ట్ చేసారని ఉత్తమ్ ఆరోపించారు. జగ్గారెడ్డిని ఎక్కడికి తీసుకుపోతున్నారో కూడా చెప్పకుండా అమానుషంగా పోలీసులు వ్యవహరించారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు.