కేసిఆర్ నాటిన మొక్క : అప్పుడట్ల, ఇప్పుడిట్ల

తెలంగాణ సిఎం కేసిఆర్ చేపట్టిన పథకాల్లో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్న పథకం హరితహారం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కోట్లాది చెట్లు నాటే కార్యక్రమం చేపట్టింది సర్కారు. హరిత హారం కేసిఆర్ సర్కారు చేపట్టిన కొత్త పథకమేమీ కాదు. గతంలో మర్రి చెన్నారెడ్డి కాలం నుంచే చోట్లు నాటే కార్యక్రమం ఉంది. అయితే గతంలో ఎవరూ ఇంత యుద్ధ ప్రాతిపదికన చెట్లు నాటుడు చేపట్టేలేదు. కేసిఆరే స్వయంగా చెట్లు నాటడంతో ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు సర్కారు యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. కేసిఆర్ నాటిన చెట్టు గురించి జనాల్లో ఆసక్తి నెలకొంది.

సిఎం కేసిఆర్ జగ్వేల్ లో నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గజ్వేల్ లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో ఆయన కదంబ మొక్క నాటారు. ఇక ముఖ్యమంత్రి చేతుల మీదుగా నాటబడ్డ మొక్క కాబట్టి దానికి ఉండే ప్రాముఖ్యత మిగతా మొక్కలకు ఉండదన్నది కూడా సహజమే. ఎందుకంటే అది విఐపి చేతుల మీదుగా నాటబడ్డ విఐపి మొక్క కాబట్టి. సిఎం నాటిన మొక్క కావడంతో అధికారులు ఆ మొక్కకు ప్రాముఖ్యతనిచ్చారు. ఎంత ప్రాముఖ్యత అంటే ఆ మొక్కను సంఘ వ్యతిరేక శక్తులు కానీ, ఆకతాయిలు కానీ చిదిమేసే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి దానికి ప్రత్యేకమైన రక్షణ చర్యలు తీసుకున్నారో పోలీసు అధికారులు. ఆ మొక్క చుట్టూ ఒకటి కాదు రెండు కాదు మూడు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకు ఆ మొక్కను ఎవరైనా ఖరాబ్ చేయకుండా ముగ్గురు సెక్యూరిటీ గార్డులను కూడా నియమించారు. అక్కడ ఒక డేరా వేసి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇటు సెక్యూరిటీ గార్డులు, అటు సిసి కెమెరాల నిఘా నీడన ఆ చెట్టు పెరగాల్సి ఉంది.

నిజానికి ఇంత ప్రభుత్వం ఇంత హడావిడి చేయకపోతుండే. అన్ని మొక్కల మాదిరిగానే అది కూడా ఒక మొక్క అన్నట్లుగానే చూసే పరిస్థితే ఉంటుండే. కానీ గత అనుభవాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కరీంనగర్ లో సిఎం కేసిఆర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. ఆ మొక్క నాటిన తర్వాత కొద్దిరోజులపాటు వర్షాలు కురియలేదు. దాంతోపాటు దాన్ని సంరక్షించాల్సిన వారు పట్టించుకోవడమే మానేశారు. ఆ కారణంగా వారం కాకముందే మొక్క ఎండిపోయింది. మొక్క నాటిన సమయంలో ముఖ్యమంత్రి చేతులు మీదుగా నాటిన మొక్క అని బోర్డు తగిలించారు. ఆ బోర్డు తీసేయకముందే మొక్క ఎండిపోయింది. ఈ విషయం పత్రికల్లో, మీడియాలో వచ్చింది. సిఎం నాటిన మొక్కకే దిక్కు లేదంటే మిగతా కోట్లాది మొక్కల పర్యవేక్షణ ఎవరు పట్టించుకుంటారు అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అంతేకాకుండా మరోచోట కొందరు ఆకతాయిలు సిఎం కేసిఆర్ నాటిన మొక్కను ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈసారి అధికారులు సిఎం నాటిన మొక్కపై వివాదాలు, విమర్శలు రాకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం దేవాలయంలో అమ్మవారికి సిఎం కేసిఆర్ సమర్పించిన పట్టుచీరె మాయమైపోయింది. బాధ్యతగా ఉండాల్సిన ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో అమ్మవారికి సిఎం పెట్టిన పట్టుచీరె మాయమైపోవడం పట్ల సర్కారు సీరియస్ అయింది. ఇద్దరు అధికారుల మీద వేటు వేసింది. ఇలా నిర్లక్ష్యంగా ఉంటున్న క్రమంలోనే ఉన్నతాధికారులు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరి నాలుగో విడత హరిత హారంలోనైనా సిఎం నాటిన కదంబ మొక్క పెరిగి వృక్షమై సేవలందిస్తుందని ఆశిద్దాం.