సేనాధిపతి వేటలో చంద్రబాబు !

Chandrababu Naidu looking forTelangana TDP president

టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగుతున్న ఎల్‌.రమణను వ్యూహాత్మకంగా 2014లో తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు నియమించటం జరిగింది. టీఆర్‌ఎస్‌ హవా చూసి రమణ 2018లోనే కారెక్కేస్తున్నారని ప్రచారం జరిగినా పరిస్థితుల అనుకూలించక ఇన్నాళ్లు సైకిల్ తొక్కుకొచ్చారు. ఇక ఇప్పుడు తెలంగాణాలో సైకిల్ తొక్కలేక కారెక్కటానికి సిద్దమయ్యి టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం జరిగింది. ఆయన రాజీనామాతో ప్రస్తుతం టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.

Chandrababu Naidu looking forTelangana TDP president

ఈ నేపథ్యంలో బాబు గారు తెలంగాణాలో పార్టీని ముందుండి నడిపించే సేనాధిపతిని ఎన్నుకునే పనిలో పడ్డారు. కానీ అదంత తేలికైన పనేమీ కాదని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ టీడీపీ పార్టీలో ఉన్న పెద్ద,చిన్న నేతలందరూ వివిధ పార్టీల్లోకి జంప్ అయ్యారు. మిగిలిన చోటా మోటా నాయకులు కూడా పార్టీకి భవిష్యత్ ఉందా అనే అనుమానం నుండి లేదనే నమ్మకానికి వచ్చేశారు. అయినప్పటికీ చంద్రబాబు లైట్ తీసుకోకుండా పార్టీకి గత వైభవం తీసుకురావాలనే పట్టుదలతోనే ఉన్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ రాజీనామా, కొత్త అధ్యక్షుని నియామకం, తెలంగాణలో పార్టీ స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా భేటీలో చర్చించారు. త్వరలోనే పార్టీ కార్యచరణ రూపొందిస్తామని టీడీపీ నేత నర్సిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో చంద్రబాబు త్వరలో సమావేశం కానునట్లు తెలిపారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం అవుతుందని నర్సిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.