కేసీఆర్, మోడీ రిలేషన్ పై చంద్రబాబు హాట్ కామెంట్స్

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను మోడీ ఎట్టి పరిస్థితిలో నమ్మే పరిస్థితిలో లేరని, కేసీఆర్ వ్యవహార శైలిని బిజెపి నిశితంగా గమనిస్తుందన్నారు. బిజెపికి 200 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కేంద్రంలో బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి చేయాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఇచ్చిన మాటను తప్పి బిజెపి ఏపికి శత్రువు అయ్యిందన్నారు. సచివాలయంలో చంద్రబాబు సమావేశం ఎన్నికల ప్రణాళిక దిశగా సాగింది.

2019 ఎన్నికల్లో పార్టీలతో పొత్తులపై చంద్రబాబు ఒక అభిప్రాయంతో ఉన్నట్టు స్పష్టమైంది. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. తెలంగాణలో, ఏపీ లో కాంగ్రెస్ తో పొత్తులు ఉంటాయని వస్తున్న వార్తలకు ఆయన స్పందించారు. కాంగ్రెస్ వాళ్లే పొత్తు ఉంటుందని చెప్తున్నారు కానీ మనం ఎక్కడ అనలేదు కదా అని చంద్రబాబు నేతలతో అన్నారు. బిజెపితో ఎట్టి పరిస్థితిలో పొత్తు ఉండదని బిజెపి ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బిజిపికి దక్షిణాదిలో గెలవలేదని అలాగే ఉత్తరాదిలో కూడా 200 సీట్లలో డిపాజిట్లు కూడా దక్కవని చంద్రబాబు నేతలతో అన్నారు. అవిశ్వాసం పెట్టినప్పుడు కాంగ్రెస్ స్వంతంగానే మద్దతిచ్చిందని టిడిపి వారి మద్దతు అడగలేదని చంద్రబాబు గుర్తు చేశారు. కాంగ్రెస్ 100 సీట్ల కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదన్నారు.

తెలంగాణలో పార్టీ బలోపేతంగానే ఉందని, పార్టీ కేడర్ చెక్కు చెదరలేదని బాబు అన్నారు. 2014లో బిజెపి తో కలిసి పోటి చేస్తే 22 శాతం ఓట్లు సాధించామని ఇప్పటికి కూడా క్యాడర్ అలాగే ఉందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రేసేతర పక్షాలుగానే మనం ముందుకు పోవాలని సూచించారు. యూనైటెడ్  ఫ్రంట్ మాదిరిగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో మీరు నాయకత్వం వహిస్తే అందరూ కలిసి వస్తారని చంద్రబాబుకు నేతలు సూచించగా నాయకత్వం గురించి ఇప్పుడు చర్చ అనవసరమని బాబు అన్నారు. తెలంగాణలో పార్టీ పొత్తులపై తెలంగాణ నాయకులతో చర్చించాకే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టిఆర్ ఎస్ ను విలీనం చేస్తానని ప్రకటించాడని కానీ దానిని చేయలేదు కాబట్టి బిజెపి కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ బిజెపితో అనుబంధంగా ఉంటున్నాడన్న వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం 3 చోట్ల బహిరంగ సభలు పెడుదామని చంద్రబాబు నేతలతో అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రలు చేసినా ప్రజలు జగన్ ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా  ఉందని మరిన్ని కార్యక్రమాలతో నిత్యం ప్రజల మధ్య నాయకులు ఉండాలని నేతలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల గురించి ఇప్పటి నుంచి చర్చ అనవసరమని బాబు వ్యాఖ్యానించారు.

సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోయినా భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాన చర్చ జరిగింది. కాంగ్రెస్, బిజేపియేతర పక్షాలను ఏకం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని బాబు అన్నారు. తెలంగాణలో కూడా పార్టీ బలంగానే ఉందన్నారు. పొత్తులపై తర్వాత చర్చిద్దామని ఇప్పటికైతే స్వంతంగానే ముందుకెళ్లాలన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చినా నష్టం లేదన్నారు. చంద్రబాబు ఆద్యంతం ఏపీ, తెలంగాణ, జాతీయ రాజకీయాలపై చర్చించారు. చంద్రబాబు సమావేశంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైంది.