సమస్యల పరిష్కారానికి సిఎంల శుభారంభం

రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇద్దరు సిఎంలు కెసియార్, జగన్మోహన్ రెడ్డి భేటీ అవటం మంచి పరిణామమమే. ఇటువంటి భేటి  గడచిన ఐదేళ్ళల్లో కెసియార్-చంద్రబాబునాయుడు మధ్య ఏనాడూ జరగలేదన్న విషయం గుర్తుండే ఉంటుంది. దానికితోడు ఇద్దరి మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే పరిస్ధితులుండటంతో అసలు ప్రయత్నాలు కూడా జరగలేదని చెప్పవచ్చు.

సరే ఏదేమైనా, ఐదేళ్ళ విలువైన కాలం గడచిపోయినా ఇప్పటికైనా ఇద్దరు సిఎంలు భేటీ అవటం సంతోషించదగ్గర పరిణామమే. కీలక సమస్యలైన వృధాగా పోతున్న నదీజలాల వినియోగం, విద్యుత్ సమస్యలు, షెడ్యూల్ 9, 10 పరిధిలోని శాస్వత భవనాల పంపకాలు, చెల్లించాల్సిన బకాయిలు తదితరాలపై కెసియార్, జగన్ మధ్య చర్చలు జరిగాయి.

అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని భేటీలో డిసైడ్ అయ్యింది. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా  కృష్ణా జలాలతో కలిపి సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను  కూడా తీర్చుకోవాలని, విద్యుత్ తయారీకి కూడా అవకాశం ఉందని నిర్ణయించారు.

కృష్ణా జలాలు తగ్గిపోతున్న నేపధ్యంలో గోదావరి జలాలను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణాలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు చెక్ పెట్టినట్లవుతుందని కెసియార్ ప్రతిపాదనకు జగన్ కూడా ఓకే చెప్పారు.

కాకపోతే గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయర్ లోకి ఎలా తరలించాలన్న విషయం మీదే నిర్ణయం కాలేదు. మొత్తానికి ఉమ్మడి సమస్యల పరిష్కారానికి  రెండు రాష్ట్రాలు చేతులు కలపటం కన్నా జనాలకు కావాల్సిందేముంటుంది ?