గ్రేట‌ర్ వార్ : మజ్లిస్ లాభం వెనుక బీజేపీ..?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార టీఆర్ఎస్ కొన్ని సీట్లను కోల్పోగా, మ‌జ్లిస్ మాత్రం అన్యూహంగా అనుకున్నవాటికంటే ఎక్కువ సీట్ల‌నే ద‌క్కించుకుని ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఒక‌వైపు టీఆర్ఎస్, బీజేపీలు హోరా హోరీగా పోటీప‌డ‌గా, మ‌ధ్య‌లో ఉన్న మ‌జ్లిస్ మాత్రం చాప‌కింద నీరులా త‌నప‌ని తానుతాను చేసుకుని గ‌తంలో కంటే ఎక్కువ సీట్లే పొందింది. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల్లో 44 స్థానాలు ద‌క్కించుకున్న‌మ‌జ్లిస్, ఈసారి ఏకంగా 51 స్థానాలు కైవ‌సం చేసుకుంది.

BJP behind Majlis gain
AIMIM – BJP

జ్లిస్ ఇటీవ‌ల కాలంలో బాగా ఢీలా ప‌డిపోయింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో టాక్ ఉంది. క్ర‌మ క్ర‌మంలో మ‌జ్లిస్ ఖిల్లా అయిన పాత బ‌స్తీలో మ‌జ్లిస్ ప‌ట్టుకోల్పోతుంద‌నే వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపించ‌సాగాయి. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల క‌మీష‌న్ బ‌ల్దియా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో, మజ్లిస్ ఎదురీదుతుందని రాజ‌కీయ‌నిపుణులు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే అనూహ్యంగా మ‌జ్లిస్ పుంజుకుని త‌న అడ్డాలో స‌త్తా చాటి పార్టీ ఉనికిని కాపాడుకుంది.

ఈసారి ఎన్నిక‌ల్లో ముఖ్యంగా రెండు ర‌కాలు నినాదాలు ఎక్కువ‌గా వినిపించాయి. ఒక‌టి ఉచితాలు, రెండోది ఉద్వేగాలు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గ‌‌తానికి భిన్నంగా టీఆర్ఎస్ అండ్ బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగింది. ఒక‌వైపు బీజేపీ ఉద్వేగాలు రెచ్చ‌గొడుతూ ప్ర‌చారం సాగించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఉద్వేగ‌మే మ‌జ్లిస్‌కు క‌లిసివ‌చ్చింది. బీజేపీ పెద్ద ఎత్తున చేసిన హిందూత్వ ఉద్వేగం ముస్లిం మైనారిటీల ఓట్లను చీలిపోకుండా ఏకం చెయ్యగలిగేలా చేసింది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బీజేపీ కావాలని చేసిందో లేక‌ తెలియక చేసిందో గానీ, వెంటిలేట‌ర్ పై ఉన్న మ‌జ్లిస్‌కు ఊపిరిపోసింది. తాము అధికారంలోకి వ‌స్తే మ‌జ్లిస్ దాచిపెట్టిన రోహింగ్యాలను త‌రిమి కొడ‌తామ‌ని, పాత్ర‌బ‌స్తీని ఓ ప‌ట్టుప‌డ‌తామ‌ని, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో స‌ర్జిక‌ల్ స్ట‌యిక్ చేస్తామ‌ని ఘాటైన ప‌ద‌జాలంతో నోటికొచ్చింద‌ల్లా మాట్లాడారు బీజేపీ నేత‌లు. దీంతో మ‌జ్లిస్ ఉంటేనే త‌మకు అండ దండ అని పాత బ‌స్తీ ప్ర‌జ‌లకు ఫుల్లుగా క్లారిటీ వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో అప్ప‌టికే కాస్త అటు ఇటుగా ఉన్న‌ ముస్లిం ఓట్లు పొల్లుపోకుండా మ‌జ్లిస్‌కు ప‌డ‌డంతో, ఏమాత్రం ఊహించ‌ని విధంగా ఎంఐఎం పార్టీ అన్ని సీట్లు గెల‌వ‌గ‌ల్గింది. దీంతో ఈ ఎన్నిక‌ల్లో మ‌జ్లిస్ లాభ‌ప‌డ‌టానికి కార‌ణం, మతపరమైన ఉద్వేగాలు రెచ్చ‌గొట్టేలా బీజేపీ చేసిన వ్యాఖ్యలే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నిక‌ల్లో మిత్ర లాభం, మిత్ర న‌ష్టం లేక‌పోయినా, శత్రులాభం మాత్రం బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. అదే ఎన్నిక‌ల ఫ‌లితాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.