తెలంగాణ నూలు పోగుల మెజీషియన్ బాలమణి

(సుమబాల)

 

 ఆమె చేయి తగలగానే సన్నటి నూలు పోగులకు  మంత్ర శక్తి వస్తుంది.అవి రకరకల ఆకారాలు తీసుకుంటాయి. తెలుగు చేనేత సంప్రదాయమై నిలబడతాయి. ఇపుడు హైదరాబాద్ మగ్గానికి కేరాఫ్ అడ్రసు గా నిలబడ్డ బాలమణికి ఆ శక్తి ఉంది. ఎపుడో చిన్నపుడు ఆసక్తి కోసం నేర్చుకున్నది ఇపు కళ అయి పరిమళిస్తూ ఉంది. ఆమెకు జాతీయ అవార్డును అందించింది.   హైదరాబాద్ మహానగరంలో చేనేత కళ  పేరు చెబితే ఇపుడుగుర్తొచ్చేది మాస్టర్ వీవర్ బాలమణి తయారు చేసిన డబుల్ ఇక్కత్ డోరియా చీరలే…

నేషనల్ అవార్డు వచ్చిన డిజైన్ ఇదే

ఆమె పూర్తిపేరు కందగట్ల బాలమణి. అవసానదశలో ఉన్న చేనేతకు చేయూత ఆమె. చదువుకుంది పదోతరగతే. కానీ చిన్నతనంనుండి తనకు నేత పని అంటే ఇష్టం. కానీ పుట్టింట్లో ఈ పని లేదు. పెళ్లైన తరువాత తనకున్న ఆసక్తికి అత్తింటివారి ప్రోత్సాహంతోడైంది. దాంతో ఆమె నేడు పేరుపొందిన మాస్టర్ వీవర్ అయ్యింది. మూడు దశాబ్దాలుగా అలుపెరుగని నేత ప్రయాణంలో తాను ఉపాధి పొందడమే కాకుండా, కుటుంబానికి మూలస్తంభంలా మారింది. నలుగురికి  ఉపాధి కల్పిస్తోంది.  

కార్వాన్ లో నిలిచిన మగ్గం

బాలమణి ఉండేది హైదరాబాద్ లోని కార్వాన్ ఏరియాలో. 80ల్లో కార్వాన్ ఏరియాలో సాదా లుంగీలు, శెల్లాలు, టవళ్లు తయారీ చేసే వందలమగ్గాలు నడిచేవి. ఒకపుడు సహకారం సొసైటీ కూడా ఉండేది. తర్వాతి కాలంలో అవి పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఈ ఏరియాలో మగ్గాలు అంటే బాలమణి ఇంట్లో మాత్రమే కనిపిస్తాయి.

మగ్గం మీద బాలమణి

ఆమె ఇల్లే ఒకవర్క్ షాప్. పదికి పైగా మగ్గాలున్నాయి మరి. నేతతో పాటు, డైయింగ్, బ్లాక్ ప్రింటింగ్ యూనిట్లు కూడా నడుపుతారు బాలమణి. అన్నట్టు ఆమె ప్రత్యేకత పోచంపల్లిలో పేరొందిన చిటికీ పని. అదే  టై అండ్ డై.

 ప్రాణం లేని దానికి భయమెందుకు?

చిన్నప్పటినుండే ఈ పనిమీద ఆసక్తి ఉన్నప్పటికీ నేత అంటే భయం ఉండేది. ఒక్క పోగు అటూ ఇటూ అయినా మొత్తం చీర డిజైన్ మారిపోతుందన్న జంకు ఉండేది. ఆ సమయంలో మామగారు, “ప్రాణంలేని దారాన్ని చూసి ప్రాణం ఉన్న మనుషులం భయపడితే ఎలా? ధైర్యంగా పనిచేయి. ఏమీ కాదు’’ అని ప్రోత్సహించారు.  ఫలితమే ఆమె నేడు కుటాంనికి మూలస్తంభం అయింది. ఎందరికో ఉపాధి కల్పిస్తోంది.

 

డబుల్ ఇక్కత్ లో జాతీయ అవార్డు

జాతీయ అవార్డు సర్టిఫికెట్

హైదరాబాద్లో ఇక్కత్ చీరల తయారీకి  పేరు  బాలమణి. అనేక బొటిక్స్ బాలమణికి ఆర్డర్స్ ఇస్తుంటారు. ఎక్కువగా వెఫ్ట్ ఇక్కత్ సిల్క్ శారీస్ నేస్తారు. వీటితో పాటు కళాంజలి లాంటి షాపింగ్ సెంటర్లకు బ్లాక్ ప్రింటింగ్ ఆర్డర్లు చేస్తారు.

ఐతే, 2012లో బాలమణి డబుల్ ఇక్కత్ చీరకు జాతీయ అవార్డు అందుకున్నారు. దీంతోపాటు రాష్ట్రస్థాయి అవార్డులు, వివిధ పారిశ్రామిక సంస్థలు ఇచ్చే అవార్డులూ అందుకున్నారు.  

అవార్డులే కాదు..మాస్టర్ వీవర్ గా ఒచ్చిన అనుభవంతో తరగతులు తీసుకుంటారు. నిఫ్ట్, హోం సైన్స్ కాలేజీ విద్యార్థులకు నాచురల్ కలర్స్, వీవింగ్, డైయింగ్ ల మీద క్లాసెస్ చెబుతారు. కొంతకాలం కిందట ఎలీప్ తో కలిసి నాచురల్ కలర్స్ తయారీలో వందమంది మహిళలకు శిక్షణ  కూడా ఇచ్చారు. ప్రస్తుతం సెంటాన్స్ డిగ్రీ  కాలేజ్ విద్యార్థులకు క్లాసులు తీసుకుంటారు.

తెలంగాణ మంత్రి కెటిఆర్ తో సన్మానం

తొందర్లోనే రాందేవ్ గూడలో ఓ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఆసక్తి ఉన్న 20 మంది మహిళలకు డైయింగ్, ప్రింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, నేతలో శిక్షణ ఇచ్చి ఎంప్లాయ్ మెంట్ కూడా ఇచ్చే ఆలోచన ఉందని చెబుతున్నారు.

ముచ్చటైన చేనేత కుటుంబం

కనుమరుగవుతున్న చేనేతతో పాటు బాలమణి ఇంట్లో మరో ప్రత్యేకత కనిపిస్తుంది. అదే ఉమ్మడికుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు, వారి పిల్లలు అంతా ఒకే దగ్గర కలిసి ఉండడమే కాదు…వర్క్ షాప్ మొత్తం కుటుంబమే చూసుకుంటుంది. ఇది కూడా వీరి సక్సెస్ కు కారణమే.

మరమగ్గాలు రాజ్యమేలుతున్న నేటి కాలంలో చేనేత నిలదొక్కుకుంటుందా అని అడిగితే నిలదొక్కుకుంటుందని చెబుతూ, నిజానికి ట్రెడిషినల్ డిజైన్లు రావడానికి చేనేతనే బెటర్ అని చెబుతున్నారు బాలమణి. అంతేకాదు, తన సక్సెస్ కు కారణం మార్కెట్ కు అనుగుణంగా డిజైన్ను, కాంబినేషన్ ను చేంజ్ చేస్తూ వెళ్లడమేనని చెప్పారు బాలమణి.