సాగర్ ఉప ఎన్నిక కన్నా ముందు బీజేపీతో టీఆర్ఎస్ మరో యుద్ధం ?

Another tough contest from BJP to TRS ahead of Nagarjunasagar by-election

తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం బీజేపీ మనోధైర్యాన్ని ఎంతగానో పెంచేశాయి. ఇదే దూుకుడును నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ చూపించాలని బీజేపీ భావిస్తుండగా.. అక్కడ బీజేపీకి చెక్ చెప్పాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. హాలియాలో సీఎం కేసీఆర్ సభ ద్వారా నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందనే విషయం స్పష్టంగా అర్థమైంది. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ముందే బీజేపీ నుంచి టీఆర్ఎస్‌కు మరో గట్టి పోటీ ఎదురుకానుంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో… మరోసారి టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనే పోటీ ఖాయమనే ప్రచారం మొదలైంది.

Another tough contest from BJP to TRS ahead of Nagarjunasagar by-election
Another tough contest from BJP to TRS ahead of Nagarjunasagar by-election

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించారు. ఈ రెండు స్థానాల్లో ఒకటి టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాగా.. మరొకటి బీజేపీ సిట్టింగ్ సీటు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం స్థానం నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మరోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు.

ఇక మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్సీగా రామచంద్రరావు ఉన్నారు. ఆయన మరోసారి పోటీ చేస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానంతో మరో స్థానాన్ని కూడా గెలుచుకోవాలని ఈ రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ వెనకబడితే మాత్రం ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చనే టాక్ వినిపిస్తోంది.

నాగార్జునసాగర్ నియోజకవర్గం అంతర్భాగంగా ఉండే నల్లగొండ, వరంగల్, ఖమ్మం సీటును టీఆర్ఎస్ కోల్పోతే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ఆ ప్రభావం ఎంతో కొంత ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈ స్థానంలో బీజేపీ విజయం సాధిస్తే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే సీటు కచ్చితంగా గెలుచుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్‌కు అంతకంటే ముందే బీజేపీతో మరో యుద్ధం గెలవాల్సి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.