హారీష్ రావు పై మరోసారి ఫైర్ అయిన కాంగ్రెస్ జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గరెడ్డి టిఆర్ఎస్ నేత హారీష్ రావు పై మరో సారి విమర్శలు చేశారు. తాను ఇక సీఎం కేసీఆర్ ను కలవనని, మీడియా ద్వారానే అన్ని విషయాలు చెబుతాన్నారు. జగ్గారెడ్డి ఏమన్నారంటే…

“సంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల వద్దా అనేది సీఎం కేసీఆర్ ఇష్టం. జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని మాత్రం అడుగను. నీటి పారుదల శాఖ సీఎం కేసీఆర్ వద్ద ఉంది కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎమ్మెల్యే హరీష్ రావు నిర్వాకంతోనే సింగూరు, మంజీరా ఎండిపోయాయి. తాను 15 రోజులుగా చెబుతున్నా అనధికారికంగా హరీష్ నీళ్లు తీసుకెళ్లిన దాని పై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.

మంజీర, సింగూరుకు చేసిన తప్పును వెంటనే సరిదిద్దాలి. గ్రౌండ్ లెవల్ వాటర్ పడిపోతుంది. ఒక్క బోరు కూడా పడడం లేదు. ప్రభుత్వం అధికారులను పంపించి దిద్దుబాటు చర్య చేపట్టాలి. హరీష్ రావు వల్లనే ఈ సమస్యలు ఏర్పడ్డాయి. హరీష్ రావు తప్పు చేశాడు కాబట్టే స్పందించడం లేదు. నేను చెప్పేవన్ని నిజాలు. నిజాలు చెప్పుతున్నాను కాబట్టే టిఆర్ఎస్ మౌనంగా ఉంటోంది.

హరీష్ రావు పెద్ద ప్రాజెక్టుల వద్దకు వెళ్లి సమీక్షించి ప్రజల్లో దేవునిగా ముద్ర పడ్డాడు. కానీ లోపల మాత్రం శఠగోపం పెట్టాడు. సంగారెడ్డి ప్రజలు చేసిన తప్పేంది. ఎందుకు సింగూరు, మంజీరాలను ఎండబెట్టారు. దీనికి హరీష్ రావు సమాధానం చెప్పాలి. ఏడు పాయల జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి.” అని జగ్గారెడ్డి అన్నారు.