ఓటమి బాధలో ఉన్న రేవంత్ రెడ్డి కి మరో చేదువార్త

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి మరో చేదు వార్త ఇది. తెలంగాణ రాజకీయాల్లో మెరుపు వేగంతో కీలక స్థానానికి చేరుకున్న రేవంత్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో కొడంగల్ లో టిఆర్ఎస్ మీద ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు జనాల ముదుకు రాలేదు. ఫలితాలు వెలువడిన వెంటనే మీడియా ముందుకొచ్చి రెండు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత నాలుగు రోజులైనా ఆయన జనాల్లోకి రాకపోవడం చర్చనీయాంశమైంది. ఓటమి బాధలో ఉన్న రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం మరో చేదు వార్త అందించింది.

రేవంత్ రెడ్డికి కల్పిస్తున్న భద్రతను తెలంగాణ పోలీసు శాఖ ఉపసంహరించింది. రేవంత్ రెడ్డికి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు 4+4 భద్రతను కల్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు వెలువరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటిరోజే రేవంత్ రెడ్డికి భద్రతను ఉపసంహరిస్తూ పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తన భద్రత విషయంలో తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.

తనకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని కేంద్ర బలగాల భద్రత కల్పించాలని కోరారు. డిజిపి మహేందర్ రెడ్డిపైన తనకు అనుమానాలున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం తొలుత కేంద్ర బలగాల భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా తర్వాత డివిజన్ బేంచ్ మాత్రం రాష్ట్ర బలగాల భద్రత కేటాయించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అది కూడా ఇప్పుడు తొలగించారు. 

ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన అసెంబ్లీలో ఉన్న సమయంలో తన పదునైన విమర్శలతో సర్కారు పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టేవారు. అందుకోసమే వ్యూహాత్మక ఎత్తుగడతో రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడించింది టిఆర్ఎస్. అయితే పోలింగ్ లో అక్రమాలు జరిగినట్లు ఆరోపనలు వచ్చాయి. పోలైన ఓట్లకు, వివి ప్యాట్ లకు తేడా ఉన్న విషయం మీడియాలో వచ్చింది. మరి కొడంగల్ లోనే కాదు తెలంగాణ అంతటా ఈరకమైన ప్రచారం సాగుతున్నది. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ పార్టీలో నేతలు గొంతు విప్పుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా స్పందించలేదు. 

తెలంగాణలో ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎంతటి ఎదురుదెబ్బలైనా భరించే సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉందని ఆయన అభిమానులు చెబుతుంటారు. కానీ అటువంటి నాయకుడు ఇప్పటి వరకు కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ భరోసా ఇచ్చేలా జనం ముందుకు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సింది పోయి రేవంత్ రెడ్డి ఇంకా చీకట్లోనే మగ్గిపోవడం మమ్మల్ని మరింత కుంగదీస్తున్నది’’ అని మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన ఒక కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు.

అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లె గ్రామానికి చెందిన రేవంత్ రెడ్డి తన విద్యాభ్యాసం వనపర్తిలో సాగింది. అయితే ఆయన 2009లో కొడంగల్ లో ఎమ్మెల్యేగా టిడిపి తరుపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లోనూ తెలంగాణ ఉద్యమ వేడిలో కొడంగల్ నుంచే గెలిచారు. అంతకముందు జెడ్పీటిసిగా, ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే టిఆర్ఎస్ పార్టీ పకడ్బంధీ వ్యూహం అమలు చేయడం, ఇతరత్రా కారణాల వల్ల 2018 ఎన్నికల్లో రేవంత్ ఓడిపోయారు. 

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రజల ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.