సిఎం కేసిఆర్ ఖాతాలో మరో కొత్త రికార్డు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రికార్డుల మోత మోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలుకొని మొన్నటి ముందస్తు ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు లాంటివాటిలో అనేక రికార్డులు నెలకొల్పారు. దేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పెద్ద పెద్ద లీడర్లు సయితం ఓటమిపాలయ్యారు. కానీ కేసిఆర్ వారి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పారు. 

తాజాగా కేవలం సిఎం కేసిఆర్, మంత్రి మహమూద్ అలీ ఇద్దరే కేబినెట్ సమావేశం నడపడం చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు. తెలుగు నేల మీద ఇలా ఇద్దరు కేబినెట్ సభ్యులే కేబినెట్ సమావేశం నడిపిన దాఖలాలు లేవని చెబుతున్నారు. ఈ విషయంలోనూ కేసిఆర్ రికార్డు నెలకొల్పినట్లే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కింద చదవండి.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం జరిగింది.
చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర సభ్యులతో పాటుగానే ప్రమాణ స్వీకారం చేయడానికి వీలుగా అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకం జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సాధారణంగా నామినేటెడ్ సభ్యుడి నియామకంలో జాప్యం జరుగుతుంది. దీనివల్ల నామినేటెడ్ మెంబర్ ఇతర సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం సాధ్యపడదు. ఫలితంగా విలువైన పదవీ కాలాన్ని కోల్పోతారు. ఈ సమస్యను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం తన మొదటి కేబినెట్ సమావేశంలోనే అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకానికి నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో గంగా జమునా తహజీబ్ ను కొనసాగించడానికి ప్రభుత్వం అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రొటెమ్ స్పీకర్ గా ముస్లిం వర్గానికి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను నియమించింది. అసెంబ్లీ నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీఫెన్ సన్ ను నియమించాలని సోమవారం జరిగిన కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి గవర్నర్ కు ప్రతిపాదనలు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే గెజిట్ విడుదల అవుతుంది.

చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యం ఉండాలనే రాజ్యాంగ నిబంధన మేరకు తెలంగాణ అసెంబ్లీలో ఈ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2018 డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గ సమావేశం అభినందించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది.

సభ్యులకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనల ప్రతులు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులకు భారత రాజ్యాంగం ప్రతులను, తెలుగు, ఇంగ్లీషు, ఉర్ధూ భాషల్లో అసెంబ్లీకి సంబంధించిన వివిధ నిబంధనల పుస్తకాలను, బుక్ లెట్లను, ఇతర సమాచారాన్ని అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సబంధించిన ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నర్సింహచార్యులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి చూపించారు.