బండి సంజయ్ ను చూసి ఏదేదో ఊహించుకుంటున్నారు.. అక్కడున్నది జగన్ 

Andhrapradesh BJP in day dreams

తెలంగాణ బీజేపీ వరుస సంచలనాలు సృష్టిస్తోంది.  అధికార పార్టీ తెరాసకు షాకుల మీద షాకులిస్తూ దూసుకుపోతోంది.  ఎంపీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో పుంజుకున్న కమల దళం మొన్న దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది.  నిన్నటికి నిన్న గ్రేటర్ ఎన్నికల్లో 48 స్థానాలు కైవసం చేసుకుని ఔరా అనిపించింది.  తెరాస 55 స్థానాలతో సరిపెట్టుకోగా బీజేపీ 48 స్థానాలు అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఈ విజయం సామాన్యమైనది   కాదు.  గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి 4 స్థానాలే రాగా ఈసారి 48 రావడం చూస్తే ఈ నాలుగేళ్లలో పార్టీ ఎంతలా బలపడిందో అర్థం చేసుకోవచ్చు.  ఈ ఫలితాలు చూశాక జనం సైతం త్వరలోనే తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకుంటున్నారు.  అధికార తెరాస పైకి గంభీరంగానే ఉన్నా బీజేపీ ఊపును తలుచుకుని లోలోపల మధనపడిపోతోంది.  

Andhrapradesh BJP in day dreams
Andhrapradesh BJP in day dreams

తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రాలో ఇంకోలా ఉంది.  ఆంధ్రా బీజేపీ అయితే త్వరలో ఏపీలో కూడ అలాంటి పరిస్థితులే వస్తాయని అంటోంది.  తెలంగాణ బీజేపీ సాధిస్తున్న విజయాలకు పొంగిపోతూ అవి తమవే అన్నట్టు భావిస్తూ భవిష్యత్తులో తాము కూడ అలానే విజృంభిస్తాయని జబ్బలు చరుస్తున్నారు.  తాజగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగవుతాయని, బీజేపీ – జనసేన కూటమి, వైసీపీల మధ్యనే ప్రధాన పోటీ అన్నారు.  అయితే ఇక్కడ వైసీపీని తట్టుకోవడం బీజేపీ వల్ల అయ్యే పనేనా అనేదే పెద్ద ప్రశ్న.  ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను చూస్తే అది అసాధ్యమనే అంటారు ఎవరైనా.  

తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది అంటే అందుకు బలమైన కారణాలున్నాయి.  అధికార పార్టీ తెరాస మీద మొదలైన వ్యతిరేకత, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి లీడర్లు పార్టీలో ఉండటం, తెలంగాణ ప్రజానీకం మార్పు కోరుకుంటుండటం అన్నిటినీ మించి అక్కడ బీజేపీకి ఒక స్పష్టమైన ఎజెండా, లక్ష్యం ఉన్నాయి.  పైన చెప్పుకున్న వాటిలో ఏవి పనిచేసినా చేయకపోయినా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీకి ఉన్న లక్ష్యమే వారిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది.  అక్కడి నాయకుల్లో ఆ కమిట్మెంట్ ఉంది.  ఈ రెండేళ్లలో వారు చేసిందంతా ముక్కుసూటి రాజకీయమే తప్ప డొంక తిరుగుడు వ్యవహారం ఎక్కడా లేదు.  అదే అక్కడి జనానికి నచ్చింది.  మరి ఏపీ బీజేపీలో ఈ లక్షణాలు ఉన్నాయా అంటే ముమ్మాటికీ లేవనే అనాలి.  

రాష్ట్రంలోని అధికార పార్టీ వైసీపీతో వారి వైఖరి ఏమిటనేది ఆ పార్టీ నాయకులకే స్పష్టత లేదు.  కాసేపు పోట్లాడుతారు, ఇంకాసేపు కౌగిలించుకున్నట్టు ఉంటారు.  ఢిల్లీ లెవల్లో స్నేహం చేస్తూ రాష్ట్రంలో పోరాటం అంటారు.  అమరావతి, పోలవరం మీద క్లారిటీ లేదు.  ఇన్ని లొసుగులు పెట్టుకుని జనం తమను నమ్ముతారని సోము వీర్రాజు ఎలా అనుకుంటున్నారో మరి.  పైపెచ్చు జగన్ ప్రభుత్వం ప్రజల్లో చాలా  బలంగా ఉంది.  భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది.  ఏడాదిన్నర జగన్ పాలన మీద ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత కనిపించట్లేదు.  అయినా జగన్ ను ఢీకొట్టగలమని సోము వీర్రాజుగారు అంటుండటం చూస్తే అది మేకపోతు గాంభీర్యమే అనిపించుకుంటుంది తప్ప ఒక నమ్మకంగా ఎలా కనబడుతుంది.