స్కూళ్ళపై ఆర్టీసీ సమ్మె ప్రభావం..సెలవుల పొడిగింపు ?

’సుబ్బిపెళ్ళి ఎంకి చావుకొచ్చింది’ సామెతలాగ తయారైంది తెలంగాణాలో పరిస్ధితి. గడచిన వారం రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమ్మె విద్యార్ధులకు సమస్యగా మారింది. రాష్ట్రంలోని అన్నీ స్కూళ్ళు ప్రస్తుతం దసరా పండుగ సెలవుల్లో ఉన్నాయి. ఈ సెలవులు కూడా 13వ తేదీతో పూర్తవుతాయి. అంటే 14వ తేదీ నుండి మళ్ళీ అన్నీ స్కూళ్ళు పునః ప్రారంభమవబోతున్నాయి.

స్కూళ్ళు తెరిచే గడువు దగ్గర పడుతోంది కాబట్టి ఊర్లకు వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అయితే సమస్యంతా ఇక్కడే మొదలైంది. వారం రోజులుగా జరుగుతున్న సమ్మెతో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్లపై కనబడటం లేదు. ఆర్టీసీ సమ్మెను కెసియార్ బాగా సీరియస్ గా తీసుకున్నారు.

ఎలాగైనా సమ్మె విఫలమైందని అనిపించుకోవాలన్న పట్టుదలతో స్కూళ్ళకు ఉన్న బస్సులు, మెటడోర్ వాహనాలు తదితరాలన్నింటినీ ఆర్టీసీ బస్సుల స్ధానంలో రోడ్లపైకి తీసుకురావాలని ఆదేశించారు. అంటే కెసియార్ ఉద్దేశ్యం ప్రకారం జనాల సౌకర్యార్ధం బస్సుల ప్లేసులో స్కూళ్ళ వాహనాలను తిప్పాలని. అయితే ఇపుడు సెలవులు కాబట్టి తిప్పుతారు సరే మరి 14వ తేదీ నుండి ఏం చేస్తారు ?

అందుకనే స్కూళ్ళ సెలవులను పొడిగించాలని డిసైడ్ అయ్యారట. అంటే స్కూళ్ళను 14 నుండి కాకుండా మరో నాలుగు రోజుల తర్వాత రీ ఓపెన్ చేయాలని అనుకున్నారట. ఈలోగా కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మెను ఉపసంహరించుకునేట్లు చేయాలన్నది కెసియార్ ప్లాన్. అంతా బాగానే ఉంది అయితే కార్మిక సంఘాలు సమ్మెను విరమించుకోకపోతే పరిస్ధితేంటి ? అప్పటి సంగతి అప్పుడు చూద్దాం లేండి ఏమవుతుందో