మంత్రి తలసానికి ఒకటే టెన్షన్, ఎందుకో తెలుసా?

రాజకీయాలకు మించిన లాభసాటి వ్యాపారం మరోకటి లేదు. పెట్టుబడి తక్కువ,రాబడి మరీ ఎక్కువ.నిజ జీవితంలో సాధ్యం కానివి, చేతికి అందనివి అన్నీ రాజకీయాలలో దొరుకుతాయి. చేయాల్సిందంతా కొద్దిసేపు పాప భీతి మర్చిపోవడమే.  అంతే, అన్ని సమకూరుతాయి. కమిషన్లు వస్తాయి.బజార్లోనే కాదు, పోలీస్ స్టేషన్లలో, గవర్నమెంట్ దఫ్తర్లో రుబాబు చేయవచ్చు. ఎవరినైనా బెదిరించ వచ్చు. మందిమార్బలం పెంచుకుని ఏ పనైనా చేతికి మట్టి, పాపం అంటుకోకుండా చేయించవచ్చు. అందుకే  రాజకీయాల్లో ఉన్న ప్రతితండ్రి ఇపుడు కొడుకును రాజకీయ వారసత్వం ఇప్పించాలనుకుంటున్నారు. ఇందులో చాలా మంది సక్సెస్ అవుతున్నారు. ఫామిలీపాలిటిక్స్ లో సక్సెస్ రేటు బాగా ఎక్కువ. కాకపోతే, కొద్దిగ ఓపిక పట్టాలి. లేకపోతే వ్యవహారం భంగపాటు అవుతుంది. అపుడు, ఆంధ్రా లో టిజివెంకటేశ్ కు వచ్చినట్లే… అంతా టెన్షన్ టెన్షన్.

ఇలాంటి భంగపాటు హైదరాబాద్ స్ట్రాంగ్ మన్ గా పేరున్న టిఆర్ ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ (సనత్ నగర్ ఎమ్మెల్యే)కు ఎదురయిందిపుడు.  దాంతో  ఆయన బాగా టెన్షన్ లో ఉన్నాడట.అసలు కధేంటో తెలుసా?

Hyderabad strongman in TRS

 

ఆయనకు ఇపుడు సీజన్ కు తగ్గ ఆలోచన వచ్చింది. కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావానుకుంటున్నాడు. దానికి జాగా కావాలి. ఇక్కడే సమస్య వచ్చింది.

హైదరాబాద్ లోన్ని కొన్ని ఏరియాల్లో  శ్రీనివాస్ యాదవ్ అంటే హడలే. దానికి తోడు బిసి నేత.   దానితో  శీనన్నగా  శ్రీనివాస్ యాదవ్  ఒక ఏరియాకి చోటా నవాబే అయ్యాడు.ఇలాంటి నవాబొకరు ప్రతిపార్టీలో ఒక రుండాలనుకుంటారు. ఆ రోజుల్లో ఆయన టిడిపిలో ఉండేవాడు. దానికి 2014లో తెలంగాణ వేవ్  ఉన్నా సరే, టిడిపితో తరఫున గెల్చేసరికి టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కళ్లు ఆయన మీద పడ్డాయి. ఇలాంటోడు టిఆర్ ఎస్ లో ఉండాలేగాని, ఆంధ్రోళ్ల పార్టీలో ఏంటనుకున్నాడు. శీనన్నకూడా మనసొంటోడు రూలింగ్ పార్టీలో క్యాబినెట్ లో ఉండాలగాని, చచ్చిపోతున్న పార్టీలో ఉండటమేమటనుకున్నాడు. టిఆర్ ఎస్ కు సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ను గప్పిట్లోకి తీసుకోవలసిన అవసరమెంతయినా ఉంది. ఎందుకంటే, హైదరాబాద్ లో టిఆర్ఎస్ చాలా వీక్ అనే అపవాదు బాగా బలంగా ఉంది. దీనిని పొగొట్టుకోవడానికి శ్రీనివాస్ యాదవ్ లాంటి లోకల్ లీడర్లు కావాలి. అంతే, బేరం కుదిరింది, శ్రీనివాస యాదవ్ పార్టీ ఫిరాయించాడు. క్యాబినెట్ లో మంత్రయ్యాడు. ఇంతవరకు కథ చాలా సాఫీగా సాగింది. ఎంత బాగసాగిందంటే కమర్షియల్ టాక్స్ శాఖ నుంచి తీసేసి వేరే చోటికి మార్చినా నొప్పి కనిపించనంత మత్తుగా రాజకీయం సాగుతూ ఉంది. శ్రీనివాస్ యాదవ్అంటే కెసిఆర్ బాగా ఇష్టమని, బాగా గురి అని అంతా అనుకుంటున్నారు. యాదవ్ కూడా మనమంటే సిఎం కెసిఆర్ చాలా నమ్మకం అనే నమ్మకం కలిగింది. దీనివల్ల శ్రీనివాస్ యాదవ్ కు  ఒక ఆలోచన వచ్చింది.

కొడుకు సాయికిరణ్ ని రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ఇదే మంచి సమయమనుకున్నడు. రాజకీయాల్లో చిల్లర మల్లర అసెంబ్లీ లెవల్ వద్దునుకున్నాడు. సికిందరాబాద్ లోక్ సభ సీటు ఐడియల్ అనుకున్నాడు. లోక్ సభ ఎన్నికల్లో గెలిస్తే, కొడుకు చక్కగా చల్లగా దేశ రాజధానిలోమకాం వేస్తాడు.

ఈ చిన్న కోరికతో ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిశాడు. ఆయన చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తన కొడుకుయోగ్యుడని, సికిందరాబాద్ ఎంపి సీటు ఇస్తే గెలిపించుకునే పూచీతనదని ఆయన ముఖ్యమంత్రి కిచెప్పాడట. ముఖ్యమంత్రి అంత శ్రద్ధగావిని, అంతా గెలిచే నమ్మకముంటే, అదేదో నువ్వే పోటీచేసి పార్లమెంటుకుపోవచ్చుగా అని సలహా ఇచ్చాడట. తన మీద, తన శక్తి సామర్థ్యాల మీద అపారమయిన నమ్మకం ఉందనుకున్న శ్రీనివాస్ యాదవ్ కు ఈ సమాధానంతో వొల్లంతా షాక్ కొట్టినట్లయింది.

ఎసరు పెట్టేందుకు వేళయిందా !

శ్రీనివాస యాదవ్ హైదరాబాద్లో ఒక పెద్ద తోపని అంతా అనుకుంటారు. అయితే, కెసిఆర్ దగ్గిర ఇలాంటి వేషాలు కుదరవు. వచ్చే ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి గెల్చేందుకు దృష్టి పెట్టకుండా ఇలా కొడుకును సికిందరాబాద్ లోక్ సభ స్థానానికి తీసుకురావానుకోవడం కెసిఆర్ కు నచ్చలేదు.  2014 ఎన్నికల్లో  సనత్ నగర్ నుంచి దండే విఠల్ టిఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ  చేసి తలసాని చేతిలోనే ఓడిపోయాడు. విఠల్ కేటిఆర్ కు మాంచి దోస్త్. 2019లో కూడా విఠల్ ని  సనత్ నగర్ నుంచి పోటీ చేయించి గెలిపించాలని కెటిఆర్ ఆలోచిస్తున్నాడని పార్టీలో బాగా టాక్ ఉంది. శ్రీనివాస్ యాదవ్ ను ఎలా సనత్ నగర్ నుంచి తప్పించాలని టిఆర్ ఎస్ నాయకత్వం యోచిస్తున్నపుడు శ్రీనివాస్ యాదవ్ కొడుకు కేసు తీసుకొచ్చాడు. ఇలాంటి అదనుకోసం ఎదురు చూస్తున్న కెసిఆర్, సికిందరబాద్ గెలుపు మీద అంత ధీమా ఉన్నపుడు తనే పోటీ చేసి ఢిల్లీకి వెళ్లవచ్చుగా అని సలహా ఇచ్చారు. తనేదో కొడుకుని ఒక ఎంపినో ఎమ్మెల్యేనో చేద్దామని ప్రయత్నిస్తుంటే, మొదటి మోసం వచ్చేలా కథ అడ్డం తిరిగిందని శ్రీనివాస్ యాదవ్ టెన్షన్ టెన్షన్ గా ఉన్నారని వార్తలొస్తున్నాయి. అయినా సరే, శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి వాటికి జంకే బాపతు కాదని, ఆయన సనత్ నగర్ ని కాపాడుకుంటాడు, కొడుకుని లోక్ సభ కాకపోతే, అసెంబ్లీకో , అథమం కౌన్సిల్ కో పంపగల సత్తా ఉన్నవాడని ఆయనంటే ఏమిటో తెలిసిన వాళ్లు చెబుతున్నారు.