బోధన్ టిఆర్‌ఎస్‌లో అవిశ్వాస కుంపటి

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటిలో టిఆర్ ఎస్ నేతల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. మున్సిపల్ చైర్మన్ ఎల్లంను తొలగించాలని మిగిలిన కౌన్పిలర్లు కలెక్టర్ కు వారి సంతకాలతో కూడిన లేఖను అందించారు. బోధన్ మున్సిపాలిటిలో 35 వార్డులు ఉన్నాయి. అందులో టిఆర్ఎస్ తొమ్మిది వార్డులు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 15, ఎంఐఎం 7, బిజెపి 3, టిడిపి 1 స్థానాలను గెలుచుకున్నాయి. ఎంఐఎం, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల సహకారంతో టిఆర్ ఎస్ సభ్యుడు ఎల్లం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. అయితే ఎల్లం మొదటి నుంచి కూడా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

ఈ నెల 3 నాటికి మున్సిపల్ పాలక వర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. పాత నిబంధనల ప్రకారం రెండన్నర సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం నాలుగు సంవత్సరాల పదవీకాలం పూర్తయితేనే అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఉంది. దీంతో నాలుగు సంవత్సరాలు పూర్తికాగానే విపక్ష సభ్యులంతా ఏకమయ్యి 29 మంది సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస లేఖను కలెక్టర్ కు సమర్పించారు.

బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రమేయంతోనే ఈ తతంగం నడుస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో షకీల్ కు 2019 ఎన్నికల్లో టిఆర్ ఎస్ టిక్కెట్ దక్కేది అనుమానమే అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే టిఆర్ ఎస్ ఫ్లోర్ లీడర్ ఎంఐఎం లో చేరాడు. టిఆర్ ఎస్ లో టికెట్ రాకపోతే ఎంఐఎం నుంచైనా పోటీ చేయాలనే ఆలోచనలో షకీల్ ఉన్నాడని తెలుస్తుంది. అందుకే ఈ అవిశ్వాస కుంపటిని రాజేస్తున్నాడని టిఆర్ఎస్ వర్గీయులు అంటున్నారు. అవిశ్వాసం పెడితే ప్రస్తుత చైర్మన్ ఎల్లంకు ఆరుగురు సభ్యుల మద్దతు మాత్రమే లభించే అవకాశం ఉంది. ముగ్గురు టిఆర్ ఎస్ సభ్యులు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేశారు. అవిశ్వాసం పెడితే ఎంఐఎం మిగిలిన సభ్యుల మద్ధతు కూడగట్టుకొని చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 25న బోధన్ మున్సిపల్ లో అవిశ్వాసం పెట్టాలా వద్దా అనే అంశం చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. బోధన్ లో ప్రారంభమైన అవిశ్వాస చిచ్చు తెలంగాణలోని పలు మున్సిపాలిటీలలో రగులుతుంది. కామారెడ్డి, భువనగిరి, రామగుండంలలో కూడా అవిశ్వాస లొల్లి పుట్టింది.

రామగుండంలో వచ్చిన విబేధాలతో ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకున్నారు. ఇతర పార్టీలకు కుంపటి పెట్టాలని భావించిన కేటీఆర్ తాను మంత్రిగా ఉన్న మున్సిపల్ శాఖ లో కుంపట్లు మొదలయ్యే సరికి ఏమీ చేయాలో తెలియక తికమక పడుతున్నారు. తెలంగాణ రాజకీయాలలో ప్రతిపక్షం లేకుండా చూడాలని భావిస్తున్న టిఆర్ ఎస్ కు స్వంత పార్టీ నుంచే కుంపటి మొదలైంది. బోధన్ మున్సిపల్ రాజకీయాలు టిఆర్ ఎస్ అధినేతకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.