బిసి రంగు పూసుకుంటున్న గులాబీ బాస్ కేసిఆర్

తెలంగాణ స్వరాష్ట్రంలో రెండో టర్మ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. రెండోదఫా ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కేందుకు తెలంగాణ సిఎం కేసిఆర్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ కు తిరుగే లేదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వందకు పైగా సీట్లు వస్తాయని తమ సర్వేలు చెబుతున్నాయంటూ కేసిఆర్ పైకి పెద్ద పెద్ద డైలాగులతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో పరిపాలన అంతా పైపై మెరుగులు తప్ప జనాలకు ఒరిగిందేమీలేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక కేసిఆర్ ను కొద్దోగొప్పో కలవరపెడుతున్న కాంగ్రెస్ పార్టీకి వాయిస్ అనేదే లేకుండా చేయడం కోసం కేసిఆర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పంచాయతీ ఎన్నికల తతంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పాచికలు వేస్తున్నారు. పనిలో పనిగా బిసిలకు గాలమేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కేసిఆర్ గతంలో ప్రకటించారు. హడావిడిగా ఎన్నికల ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. అయితే బిసి రిజర్వేషన్లు గతంలో మాదిరిగానే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ బిసి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈమేరకు కాంగ్రెస్ హైకోర్టు మెట్లెక్కింది. దీంతో బిసి రిజర్వేషన్ల పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని హైకోర్టు వెల్లడించింది. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు కేసిఆర్ పాచిక వేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో తెలంగాణ సిఎం ఆఫీసు నుంచి ఒక ప్రకటనలు వెలువడింది. ఆ పూర్తి ప్రకటన కింద ఉంది చదవండి.

‘‘ పంచాయితీ రాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై  రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పంచాయితీ రాజ్ సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికోసం అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సిఎం ఆదేశించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో పాటు ఇతర సంబంధిత అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచి, అన్ని విషయాలను కూలంకశంగా చర్చించి, పూర్వాపరాలను సమగ్రంగా పరిశీలించి, తెలంగాణలోని పంచాయితీ రాజ్ సంస్థల్లో 61 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేవిధంగా వాదనలు ఖరారు చేయాలని సిఎం కోరారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ సర్పంచ్ స్వప్నా రెడ్డి ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించి, కాంగ్రెస్ పార్టీ బిసిల రిజర్వేషన్లకు గండి కొట్టిందని సిఎం విమర్శించారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్ కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ’’

తెలంగాణ సిఎం కేసిఆర్ తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీపై నెపం నెట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ స్పందించింది. బిసి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ కోర్టుకు పోతే అదేదో బిసి వ్యతిరేక పార్టీ అన్నట్లుగా కేసిఆర్ ప్రచారం చేయడం సరికాదంటోంది కాంగ్రెస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ తీరు చూస్తే సర్పంచ్ ఎన్నికలు జరపాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదని తేలిపోయిందన్నారు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి. తెలుగురాజ్యంతో ఆయన సర్పంచ్ ఎన్నికలు, కేసిఆర్ ప్రకటనలపై మాట్లాడారు. తన వైఫల్యాలను కాంగ్రెస్ మీద రుద్దే ప్రయత్నం చేస్తోందని సర్కారుపై చింపుల మండిపడ్డారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సింహభాగం రెడ్డి నాయకులే ఉన్నారు. పార్టీలో అన్ని స్థాయిల్లో రెడ్డీ లీడర్లే ఉన్నారన్న విషయం జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రెడ్డి పార్టీగా చిత్రీకరించడంతోపాటు, బిసి వ్యతిరేక పార్టీగా కూడా చిత్రీకరించే ప్రయత్నాలు టిఆర్ఎస్ చేస్తోందన్న ఆరోపణలున్నాయి. అందుకోసమే స్థానిక సంస్థల ఎన్నికలు తాము నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డు పడుతోందన్న అపవాదును మోపే ప్రయత్నం చేస్తున్నారు కేసిఆర్. నిజానికి కోర్టుకు పోవడం అనేదే కేసిఆర్ పరిభాషలో తీవ్రమైన నేరంగా భావిస్తున్నట్లున్నారు. అందుకే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఇతర ఏ సందర్భంలో ఎవరైనా కోర్టుకు పోతే వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వప్నా రెడ్డి అనే సర్పంచ్ ను కేసిఆర్ టార్గెట్ చేసి పత్రికా ప్రకటనలు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మెల్లమెల్లగా బిసి నినాదం తీసుకునేందుకు కేసిఆర్ ఎత్తగడలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో బలమైన సామాజిక వర్గం రెడ్డీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు. బిసిలకు దన్నుగా ఇంతకాలం ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. ఈ పరిస్థితుల్లో బిసిలను ఓన్ చేసుకునే పార్టీ ఇప్పటికైతే తెలంగాణలో లేదు. తెలంగాణ 52 శాతంగా ఉన్న బిసిలు తమను భుజాన మోసే పార్టీ లేదన్న భావనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన తెలంగాణ జన సమితి ఇప్పటివరకైతే బిసిలను ఓన్ చేసుకునే ప్రయత్నాలేమీ చేస్తున్నట్లు లేదు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా టిడిపి కి దన్నుగా ఉన్న బిసిలను తనవైపు గుంజుకోవాలన్న ప్లాన్ తో కేసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లలో తన కుటుంబసభ్యుడైన సంతోష్ రావుకు ఒక సీటు ఇచ్చి మిగతా రెండు సీట్లు బిసిలకే కట్టబెట్టారు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు బిసిలే ఉన్నారు. అంటే రాజ్యసభ టిఆర్ఎస్ బలంలో ఆరులో నాలుగు బిసిలే ఉన్నారు. మిగతా రెండులో ఒకరు వెలమ, ఇంకొకరు బ్రాహ్మణ ఉన్నారు. తెలంగాణలో చక్రం తిప్పగలిగే స్థితిలో ఉన్న రెడ్డీలకు రాజ్యసభలో ఇప్పటివరకు కేసిఆర్ అవకాశమే ఇవ్వలేదు. దీన్నిబట్టి తెలంగాణలో కేసిఆర్ బిసి ముసుగు కప్పుకోవడం ఖాయంగా కనబడుతున్నది. దానికితోడు మొన్నటికి మొన్న బిసిలకు 119 గురుకులాలు ప్రకటించారు. కానీ వాటిని వచ్చే ఏడాది ప్రారంభిస్తామని చెప్పి ఉసూరుమనిపించారు.

నిజానికి సర్పంచ్ ఎన్నికలు జరపాలన్న ఉద్దేశం టిఆర్ఎస్ కు ఇష్టం లేదన్న వాదన ఉంది. అసెంబ్లీకి ఎన్నికలు ముగిసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు జరపాలంటూ ఎమ్మెల్యేలు కేసిఆర్ కు మొర పెట్టుకున్నారట. దీంతో తాము సర్పంచ్ ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడుతోందన్న ప్రచారం చేస్తూ ఎస్కేప్ కావాలని స్కెచ్ వేస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ బిసి వ్యతిరేక రెడ్డి పార్టీ అని బలమైన ముద్ర గుద్ది ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలన్న ఉద్దేశంతోనే కేసిఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంచనాకు వచ్చాయి.