గ్రేటర్ టీఆర్ఎస్ లో ఆ లీడర్లు ఉక్కిరి బిక్కిరి

ముందస్తు ఎన్నికలు రానున్నాయి అని వస్తున్న వార్తల నేపథ్యంలో గ్రేటర్ హైద్రాబాద్ టీఆర్ఎస్ లీడర్లు అలర్ట్ అయ్యారు. టిఆర్ఎస్ పార్టీ తరుపున అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు టిక్కెట్ వేటలో పడ్డారు. అన్ని నియోజక వర్గాల్లో నాయకులు ఎవరికి వారు రాజకీయ సన్నాహాలు మెదలు పెట్టారు. అయితే చాలా నియోజకవర్గాల్లో గతంలో గులాబీ పార్టీలో ఉన్నవారు తమకు టికెట్ ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల్లో గెలిచి బంగారు తెలంగాణ కోసం టిఆర్ఎస్ లో చేరిన వారు కూడా తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఖాయమని కేసిఆర్ ప్రకటనను సిట్టింగ్ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తూ మైండ్ గేమ్ షురూ చేశారు. అయితే వీరి వ్యవహారం ఇలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి కొంత మంది వేరే పార్టీల నుండి టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన వారు ఉన్నారు. అటువంటి వారందరూ తమకు టికెట్ దక్కకపోతే తమ పరిస్థితి ఏమిటి అన్న ఆందోళనలో ఉన్నారు.

గ్రేటర్ హైద్రాబాద్ లో 24 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్బుల్లాపుర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ కంటోన్మెట్ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ స్థానాల్లో  ఉన్న సిట్టింగ్ నేతలే పార్టీ లో పెత్తనం చలాయిస్తున్నారు. దీంతో తమకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్ గ్యారెంటీగా దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. ఆయా నియోజవర్గాల్లో పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా పార్టీ అధిష్టానంతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. టికెట్ కోసం విన్నపాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ పార్టీ అధిష్టానం భరోసాతో ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ లోకి వచ్చిన వారు చాపకింద నీరులా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పైకి లేదు లేదంటూనే అధిష్టానం వద్ద తీవ్రంగానే టికెట్ కోసం ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు.

ప్రస్తుతం రాజేంద్రనగర్ నియోజక వర్గం నుండి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గా ఉన్నాడు.ఇదే  నియోజక వర్గంలో ఉంటున్న శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు ఇదే స్థానం నుండి అదే నియోజక వర్గం కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీచేసే అవకాశం ఉంది.

సనత్ నగర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మళ్లీ తానే పోటీచేస్తానని అంటున్నారు.గతంలో ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ తరుపున పోటి చేసిన దండె విఠల్ , ఏదో విధంగా మళ్లీ టికెట్ కోసం ఆశతో ఉన్నాడు.

ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన సాయన్న టిడిపి నుండి  టీఆర్ఎస్ లో చేరిండు.2014 ఎన్నికల్లో  టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటిచేసి ఓడిన గజ్జల నగేష్, ఈ సారి తనకే చాన్స్ దోరుకుతుందన్న ఆశతో ఉన్నాడు.

ఇలా గ్రేటర్ హైద్రాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం  వహిస్తున్న నియోజకవర్గం స్థానాల్లో ఇద్దరు ముగ్గురు పోటి చేయనున్నారు.  ఇటివల ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైద్రాబాద్ లో టిక్కెటు ఆశావాహుల్లో అధిష్టానం ఎవరికి కెటాయిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.