అదరగొట్టిన కుర్రాళ్లు .. బ్రిస్బేన్ లో భారత్ సూపర్ విక్టరీ !

గబ్బా టెస్ట్ లో టీమిండియా రెచ్చిపోయింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ ను కైవసం చేసుకోవడంతో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆఖరి టెస్ట్ లో మూడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది టీమిండియా. దీంతో 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. యంగ్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అదిరిపోయే బ్యాటింగ్ తో టీమిండియా అద్భుత విజయాన్ని అందించాడు.

Team India hits out Australia in Brisbane test

328 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ చివరి వరకు క్రీజులో నిలిచి భారత్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. చివర్లో పంత్ బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టగానే టీమిండియా ఆటగాళ్లలో విజయానందం ఉప్పొంగింది. పంత్ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ కు 4, స్పిన్నర్ నేథన్ లైయన్ కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పంత్ నే వరించింది.

ఈ సిరీస్ లో 21 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్ కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది.నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

ఆ తర్వాత పుజారా, రహానే కొంచెం సేపు ప్రతిఘటించారు. అయితే, ఫస్ట్ నుంచే దూకుడు మీద కన్పించిన రహానే అనవసరపు షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరోవైపు తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేసిన పుజారా మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే 56 పరుగులు చేసిన తర్వాత పుజారా కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత మయాంక్ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే, ఆ తర్వా త పంత్ తనదైన స్టైల్ లో ఆడి టీమిండియాకు విక్టరీని అందించాడు.

రిషభ్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో టీమిండియా ఈజీగా విక్టరీ కొట్టింది. రిషభ్ పంత్ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు.కాగా, ఈ విజయంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్ వద్దే ఉండనుంది. వాస్తవానికి ఆసీస్ తో పోలిస్తే ప్రస్తుత భారత జట్టుకు అనుభవం తక్కువ. జట్టులో కొత్త ఆటగాళ్లే ఎక్కువ. జట్టులో సగం మంది సీనియర్లు గాయాలతో దూరమైన స్థితిలో సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు శక్తికి మించిన ప్రదర్శన చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించారు.