రెచ్చిపోయిన కెప్టెన్ కొహ్లీ..రెండో టీ20లో ఘనవిజయం

మోతెరాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ పరుగుల మోత మోగించాడు. నరేంద్ర మోదీ స్టేడియంంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. విరాట్ కొహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి భారత్ జట్టును గెలిపించాడు. యువ ఆటగాటు ఇషాన్ కిషన్ కూడా అదరగొట్టాడు. ఫలితంగా 164 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి..17.5 ఓవర్లలో ఛేదించింది.

IND vs ENG: మోతెరాలో కెప్టెన్ కొహ్లీ షో.. రెండో టీ20లో టీమిండియా బిగ్ విక్టరీ

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తొలి ఓవర్లలోనే ఓపెనర్ జోస్ బట్లర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మలాన్, రాయ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓపెనర్ రాయ్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ మోర్గాన్ 28, మలాన్ 24, స్టోక్స్ 24, బెయిర్‌స్టో 20 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్,శార్దుల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు తీశారు. చాహల్, భువనేశ్వర్ తలో వికెట్ పడగొట్టారు.

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఐతే తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కొహ్లీ, ఇసాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్ చక్కదిద్దారు. అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కొహ్లీ 73, ఇషాన్ కిషన్ 56 రన్స్ చేశారు. ఇషాన్ కిషన్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన, పంత్ కాసేపు మెరుపులు మెరిపించాడు. పంత్ ఔట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి భారత జట్టును విజయ తీరాలకు నడిపించాడు కొహ్లీ.